‘యముండా..’ అంటూ సాలిడ్ సౌండ్ ఇవ్వగలిగే ఏకైక తెలుగు నటుడు, నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ. హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఆయన చేయని పాత్ర లేదు. నవరసాలని అలవోకగా పలికించే లెజండరీ నటుడు కైకాల. ఘటోత్కచుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు తదితర పౌరాణిక పాత్రలకు జీవం పోసి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
60 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ.. 200 మంది పైచిలుకు దర్శకుల డైరెక్షన్లో.. సుమారు 700 వందలకు పైగా చిత్రాల్లో నటించి.. ప్రజలను మెప్పించిన కైకాల సత్యనారాయణకి ఒక బలమైన కోరిక ఉండేది. కానీ అది తీరకుండానే కన్నుమూశారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ ల మల్టీస్టారర్ చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణకు.. చివరిగా మరో మల్టీస్టారర్ చేయాలనీ కోరిక బలంగా ఉండేదట. ముఖ్యంగా ఇండస్ట్రీ దిగ్గజాలైన చిరంజీవి, బాలకృష్ణలు కలిసి చేస్తే ఆ స్టారర్ లో మంచిపాత్ర చేయాలనీ అడిగేవారట. చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఎన్నోసార్లు తన కోరికని బయటపెట్టాడట. కానీ ఈ కాంబినేషన్ లో నటించకుండానే చనిపోయారు కైకాల. ఇక తాజాగా మొన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల RRR చిత్రాన్ని చూసి చాలా సంతోషించారట. ఈ కాంబినేషన్ లానే చిరు, బాలయ్యలు కలిసి నటిస్తే బాగుంటుంది అంటూ అనేవారట కైకాల సత్యనారాయణ.