జబర్దస్త్ టీవీ షోలో పచ్చిబూతులకు ఇకఇకలు పకపకలతో కలసికట్టుగా ఆటను రక్తికట్టించిన రోజా, నాగబాబుల మధ్య ఇప్పుడు మంచుగడ్డ వేసినా భగ్గుమంటోంది. ఒకరినొకరు ఘోరంగా తిట్టిపోసుకుంటున్నారు. రోజాది నోరా, చెత్తకుండీనా అని నాగబాబు చేసిన విమర్శలపై ఆమె కూడా ఘాటుగా స్పందించారు. మాట్లాడేముందు జాగ్రత్తగా ఆలోచించుకుని మాట్లాడు అని హెచ్చరించారు. ‘‘ఏదైనా అనేముందు మ్యాటర్ ఉండాలి. నోటికి ఏమొస్తే అలా అబద్ధాలు ప్రచారం చేయకూడదు. చిరంజీవి కేంద్రంలో పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి ఏం చేశారని నేనెప్పుడైనా అడిగానా? చిరంజీవిగారు ఇప్పుడు రాజకీయాల్లో లేరుకాబట్టి ఏమీ అనను. నాగబాబు ముందుగా ఆడవాళ్లను గౌరవించడం నేర్చుకోవాలి..’’ అని రోజా అన్నారు. భారతదేశ పర్యటకశాఖ ఇటీవల వెలువరించిన ర్యాంకుల్లో ఏపీకి 18 ర్యాంకు రావడంపై నాగబాబు రోజాను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఆమె తన బాధ్యతను మరిచిపోయి నోటికి వచ్చినట్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఏపీ 20వ ర్యాంకుకు దిగజారుతుందని, ఆమె నోటికి, మునిసిపాలిటీ చెత్తకుండీకి తేడా లేదన్నారు.