Actor Mohan Babu Controversial Comments On Police Officers In Tirupati
mictv telugu

పోలీసు ఆఫీసర్లు గవర్నమెంట్‌కు తొత్తులు.. మోహన్ బాబు

December 20, 2022

Actor Mohan Babu Controversial Comments On Police Officers In Tirupati

స్టేజ్ ఎదురుగా జనాలు, చేతిలో మైక్ ఉంటే చాలు.. మంచు ఫ్యామిలీ రెచ్చిపోతుంది. ఒక్క మంచు మనోజ్‌ను మినహాయిస్తే మిగతా కుటుంబ సభ్యులంతా.. ఏ విషయాన్నైనా కుండబద్ధలు కొట్టినట్లు చెబుతుంటారు. వారి స్పీచ్‌లకు పెద్ద అభిమాన సంఘాలే ఉన్నాయి. ప్రేక్షకులు కూడా వారి కామెంట్లను చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌కు అతిథిగా హాజరైన డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు.. అదే రీతిలో మరోసారి మాట్లాడారు. పోలీసు ఉన్నతాధికారులు గవర్నమెంట్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. వారి కోసమే ఐఏఎస్‌లు, ఏపీఎస్‌లు పని చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ విషయమైనా సరే.. నిజాన్ని నిర్భయంగా చెప్తానంటూ కామెంట్స్ చేశారు.

ఏపీలోని తిరుపతిలో నిర్వహించిన లాఠీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. “నేనెప్పుడు పోలీస్ అనే పదాన్ని గౌరవిస్తా. వాళ్లు కూడా మనలో నుంచి ఆ ఉద్యోగాల్లోకి వెళ్లిన వాళ్లే. మనం పోలీసులకు కచ్చితంగా గౌరవం ఇవ్వాల్సిందే. ఏ నిజమైనా ముందుగా పోలీసులకు.. అందులోనూ ఓ కానిస్టేబుల్‌కు తెలుస్తుంది. కానీ.. నాకు భాదనిపించే విషయమేంటంటే.. ఎక్కువ శాతం ఏ గవర్నమెంట్‌ ఉంటే ఆ గవర్నమెంట్‌కు పని చేయాల్సిన బాధ్యత కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎలపై ఉంటోంది. కిందిస్థాయి పోలీసులు తమ పై స్థాయి అధికారుల దగ్గరికి వెళ్లి.. నేను నిజం చూశాను.. నన్ను తప్పు చెప్పమంటున్నారని చెబితే.. అతని ఉద్యోగమే పోతుంది. అంటే ఆ పై అధికారులు.. ఎక్కువ శాతం ఏ గవర్నమెంట్‌ ఉంటే ఆ గవర్నమెంటుకు తొత్తులుగా ఉంటారు. ఇది నేను ఓపెన్‌గా చెప్తాను. నేను ఎప్పుడూ పోలీసు డిపార్ట్ మెంట్‌కు గౌరవం ఇస్తాను””అని చివరలో పోలీసులపై మర్యాదపూరిత వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారు అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అయితే.. మంచు ఫ్యామిలీ అటు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి.. ఇటు కేంద్రంలో ఉన్న మోదీ సర్కారుకు ఇలా రెండు చోట్ల సత్సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. మోహన్ బాబు ఇలాంటి కామెంట్లు చేయటం వెనుక అర్థమేంటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.