జార్జిరెడ్డిని పవన్‌తో తీద్దామనుకున్నాను.. నాగబాబు - MicTv.in - Telugu News
mictv telugu

జార్జిరెడ్డిని పవన్‌తో తీద్దామనుకున్నాను.. నాగబాబు

November 12, 2019

‘ఉస్మానియా చేగువేరా’గా పేరొందిన జార్జిరెడ్డి జీవితం ఆధారంగా బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే. నేటి తరానికి పెద్దగా తెలియని ఆ విప్లవ విద్యార్థి జీవితాన్ని ‘జార్జిరెడ్డి’ పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 22న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో సందీప్‌ మాధవ్‌, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో నటించగా.. దళం ఫేమ్ జీవన్‌రెడ్డి దర్శకత్వం వహించారు. అప్పిరెడ్డి మైక్ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ చూసిన సీనియర్‌ నటుడు నాగబాబు చిత్ర బృందాన్ని అభినందిస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. త్వరలోనే వారిని జార్జిరెడ్డి చిత్ర బృందాన్ని కలవనున్నట్లు తెలిపారు. ‘జార్జ్ రెడ్డి లాంటి మహానుభావుడి కథ పది మందికి తెలియాలి పదిమంది చూడాలి, త్వరలోనే నేను జార్జ్ రెడ్డి టీం తో మీ ముందుకు వస్తాను….’ అని తెలిపారు.

నాగబాబు వీడియోలో మాట్లాడుతూ..’ఇటీవల నేను రోడ్డుపై వెళ్తుంటే, ‘జార్జిరెడ్డి’ పోస్టర్లు చూసాను. ఆసక్తిగా అనిపించి ఆ సినిమా ట్రైలర్‌ చూశాను. జార్జిరెడ్డి ఉస్మానియాలో ఓ విద్యార్థి నేత అనే విషయం తెలుసు. ఆయన గురించి చాలా ఏళ్లుగా వింటూనే ఉన్నా. ఆ పాత్రను కల్యాణ్‌బాబుతో గానీ, లేదా వరుణ్‌తో గానీ చేయిస్తే ఎలా ఉంటుందని చాలా సార్లు ఆలోచించా. కానీ, ఈలోగా జీవన్‌రెడ్డి ఆ కథతో సినిమా తీసేశారని తెలిసి చాలా సంతోషించా. ఎందుకంటే ట్రైలర్‌ చూసిన తర్వాత అలాంటి పాత్రకు బాగా పేరున్న నటుడు అయితే అంతగా సరిపోడని నాకు అనిపించింది. సందీప్‌ మాధవ్‌ ఇప్పటివరకూ చిన్న చిన్న పాత్రలే చేశాడు. దాంతో జార్జిరెడ్డి పాత్రకు చక్కగా సరిపోయాడు.’ అని అన్నారు.