కార్తికేయ 2 కేక.. ఒక్క హిందీలోనే 1000 స్క్రీన్లు, 3000 షోలు
యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ-2 టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఎన్నో కష్టాలు.. అనేక వాయిదాల తరువాత ఆగస్టు 13న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 2014లో విడుదలైన కార్తికేయ మూవీకి ఇది సీక్వెల్. డైరెక్టర్ చందు మొండేటిపై దర్శకత్వంలో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి.
ముఖ్యంగా హిందీలో బిగ్ స్క్రీన్లపై కార్తికేయ-2 హవా ఓ రేంజ్‌లో నడుస్తోంది. మొదట 50 స్క్రీన్లలో రిలీజ్ చేయగా.. క్రమంగా ఆ సంఖ్య పెరిగిపోయింది. కృష్ణ పరమాత్మ చెప్పిన సందేశం.. ఆయన గొప్పదనం, ఎలివేషన్ ఇచ్చిన తీరుకు నార్త్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుండడంతో రోజురోజుకు స్క్రీన్ల సంఖ్య పెంచుకుంటూ పోయారు. శుక్రవారం నాటికి 1000 పైగా స్క్రీన్‌లలో, 3000 షోలతో కార్తికేయ-2 ఆడుతుందంటే.. తెలుగు సినిమా సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎలాంటి ప్రమోషన్‌లు చేయకుండానే ఈ చిత్రానికి హిందీ బెల్ట్‌లో ఈ స్థాయి క్రేజ్ వచ్చిందంటే విశేషం అనే చెప్పాలి. ఇటీవల రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రాలు లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ సినిమాలను క్రాస్ చేసి.. కార్తికేయ-2 దూసుకుపోతుంది.
నేడు కృష్ణాష్టమి సందర్భంగా స్క్రీన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సినిమాలో కంటెంట్ ఉంటే.. భాషతో సంబంధం లేకుండా హిట్ కొట్టొచ్చని కార్తికేయ-2 మూవీ టీమ్ నిరూపించింది. ఇప్పటివరకు టాలీవుడ్‌లో చిన్న హీరోగా పేరున్న నిఖిల్.. ఒక్కసారిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష, అనుపమ్ ఖేర్ ప్రధానపాత్రల్లో నటించారు.