Actor Prakash Raj made key comments on his film career
mictv telugu

ఆ ఆసక్తి నా సినీ కెరీర్‌‌ని దెబ్బ తీసింది : ప్రకాశ్ రాజ్

November 15, 2022

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తన సినీ కెరీర్‌‌, ఇతర నటులపై ఇటీవల షాకింగ్ కామెంట్ చేశారు. రాజకీయాలపై తనకున్న ఆసక్తి వల్ల సినీ కెరీర్ దెబ్బతిన్నదని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అంతేకాక, నాతో కలిసి పని చేయడానికి కొందరు నటులు భయపడుతున్నారని, అందుకు వారిని నిందిండం లేదని అభిప్రాయపడ్డారు. ప్రకాశ్ రాజ్ 2019 లోక్ సభ ఎన్నికల్లో బెంగళూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అంతటితో ఆగక ఇటీవల కేంద్రంలోని బీజేపీ, మోదీ విధానాలపై తరచూ విమర్శలకు దిగుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ కామెంట్లు చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన మాటల్లోనే ‘నేను ప్రస్తుతం రాజకీయ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాను. గతంలో నాతో కలిసి పని చేసిన వారు ఇప్పుడు నాతో నటించడానికి భయపడుతున్నారు. నాతో పని చేస్తే జనం వారిని యాక్సెప్ట్ చేయరేమోనన్న భయం వారిలో ఉంది. అయితే ఈ విషయంలో నాకు బాధలేదు. నా భయం మరొకరికి శక్తిగా మారకూడదనుకుంటున్నాను. అలాంటి వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కొంటాను. నేను నా స్వరాన్ని వినిపించకపోతే కేవలం మంచి నటుడిగానే చనిపోతాను. అందుకే ఇలాంటి విషయాలపై విచారించకుండా ఇప్పుడు మరింత స్వేచ్ఛగా ఉన్నానని భావిస్తున్నాను. నాలా మాట్లాడి తర్వాత వచ్చే పరిణామాలను ఎదుర్కొనే ధైర్యం లేక చాలా మంది నటులు మౌనంగా ఉంటున్నారు. అందుకు వారిని నిందించాలనుకోవడం లేద’ని తన భావాలను నిక్కచ్చిగా వెల్లడించారు.