Actor Prakash Raj shared Modi's video
mictv telugu

వీడియో : మరోసారి ‘కెమెరా’ ఘటనలో మోదీ.. షేర్ చేసిన ప్రకాశ్ రాజ్

June 21, 2022

ప్రధాని నరేంద్ర మోదీకి కెమెరాపై మక్కువ ఎక్కువని, అందుకోసం కొన్నిసార్లు పక్కన ఎవరున్నా పట్టించుకోరనే విమర్శలు విని ఉంటాం. ఆయన కెమెరా షోకులను కొందరు ట్రోల్ కూడా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అలాంటి వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రధాని మోదీ ఇటీవల కర్ణాటక వెళ్లగా, అక్కడే మంగళవారం మైసూరులో యోగా డేను జరుపుకున్నారు. ఈ క్రమంలో మోదీ హెలికాప్టర్‌ దిగి నడుచుకుంటూ వస్తుండగా, రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తులు వరుసగా క్యూలో నిల్చున్నారు.

మోదీ ఇంకా వీరి దగ్గరకు రాకముందే ఓ వ్యక్తి కాస్త ముందుకు జరిగి సమీపించే ప్రయత్నం చేశారు. దాంతో మోదీ ఆగి, ఆ వ్యక్తిని వెనక్కి వెళ్లమని సూచించారు. అర్దం కాని ఆ వ్యక్తి ప్రధాని ఏదో చెప్తున్నారని అనుకొని రెండడుగులు ముందుకు వేశాడు. దాంతో మోదీ రెండు చేతులతో వెనక్కి వెళ్లమని అర్ధమయ్యేలా చెప్పారు. ఇంతలో ఆ వ్యక్తి వెనుక క్యూలో నిలుచున్న మిగతా వారు వెనక్కి రమ్మని పిలవడంతో ఆయన వెనక్కి వెళ్లిపోయారు. తర్వాత మోదీ ముందుకు నడుచుకుంటూ వెళ్లి, వారికి అభివాదం చేసుకుంటూ వెళ్లారు. ఈ వీడియోను ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ..‘కెమెరా కనిపిస్తే చాలు.. నటనలో అందరినీ మించిపోతారు. ఇందులో ఎవ్వరూ ఆయనను దాటలేరు’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అంతేకాక, జస్ట్ ఆస్కింగ్ అనే హ్యష్ ట్యాగ్ జత చేశారు.