సోనుసూద్‌కు ప్రకాశ్‌రాజ్ సన్మానం - MicTv.in - Telugu News
mictv telugu

సోనుసూద్‌కు ప్రకాశ్‌రాజ్ సన్మానం

September 28, 2020

Actor Prakashraj honor to Sonu Sood

కరోనా వైరస్ సృష్ఠించిన సంక్షోభంలో ఎందరో అసహాయులకు అండగా నిలిచాడు నటుడు సోనూసూద్. సూపర్ హీరో, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ మాదిరి కరోనా హీరో అయ్యాడు సోనూ. ఎంతోమంది వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లి కరోనా నుంచి తమనుతాము కాపాడుకుని కశికెడి గంజి తాగైనా ప్రాణాలు నిలుపుకుంటామని భావించారు. కానీ, లాక్‌డౌన్ కారణంగా ఎందరో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో సోనూ వారందరిని వారివారి ఊళ్లకు తరలించాడు. ప్రత్యేక బస్సులు, రైళ్లు, విమానాల్లో వలస కూలీలను తరలించి గొప్ప మనసును చాటుకున్నాడు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించారు. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ అపర దానకర్ణుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోవైపు అనాథ పిల్లలను దత్తత కూడా తీసుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో దేశంయావత్తు సోనూ మంచి మనసుకు నీరాజనాలు పలుకుతున్నారు. తాజాగా సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా సోనూ చేస్తున్న మంచి పనులపై ఫిదా అయ్యారు. ‘అదుర్స్ అల్లుడు’ సెట్‌కు వెళ్లిన ప్రకాశ్‌రాజ్ సోనూసూద్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించారు. ఓ జ్ఞాపికను కూడా బహూకరించి సోనూ చేస్తున్న మంచి పనులను ప్రశంసించారు. కష్టకాలంలో సోనూసూద్ ఆపన్నులకు అందించిన సేవలకు తాను ఇస్తున్న ప్రోత్సాహం ఇది అని అన్నారు.