Actor Pratap Pothan is no more
mictv telugu

నటుడు ప్రతాప్ పోతన్ ఇకలేరు

July 15, 2022

 

మలయాళ సీనియర్ నటుడు, నిర్మాత ప్రతాప్ పోతన్ (69) ఈరోజు ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి లోనై, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు.

ప్రతాప్ పోతన్..1951 ఆగస్టు 13న కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి కల్గిన ఆయన సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. దర్శకుడు భరతన్ డైరెక్షన్‌లో 1978లో ‘ఆరవం’ సినిమాతో అరంగేట్రం చేశాడు. ‘థకారం’, ‘ఆరోహణం’, ‘పన్నీర్ పుష్పంగల్’, ‘తన్మాత్ర’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల నుంచి మంచి అదరణ పొందారు. అంతేకాదు 100కుపైగా మలయాళం, తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించారు. ప్రతాప్ పోతన్ మలయాళంలో మూడు చిత్రాలకు ‘రితుభేదం’, ‘డైసీ’,’ఒరు యాత్రమొళికి’ దర్శకత్వం వహించారు. యాక్టర్‌గా, ఫిల్మ్ ప్రొడ్యూసర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, డైరెక్టర్‌గా సినీ రంగంలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

ఇక, ఆయన వ్యక్తిగత జీవితానికి విషయానికొస్తే.. 1985లో ప్రముఖ నటి రాధికను ఆయన వివాహం చేసుకున్నారు. కానీ, సంవత్సరం తిరగకముందే ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత 1986లో అమలా సత్యనాధ్ అనే కార్పొరేట్ ఉద్యోగిని వివాహమాడారు. వారికి ఒక అమ్మాయి ఉంది. అయితే, 2012లో ఆమె నుంచి కూడా ప్రతాప్ పోతన్ డైవోర్స్ తీసుకున్నారు.