నువ్వే కావాలి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సాయి కిరణ్.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన తర్వాత కాలంలో సినిమాలకు దూరమయ్యారు. అయినా బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు మాత్రం దగ్గరగానే ఉన్నారు. ప్రస్తుతం గుప్పెడంత మనసు వంటి కొన్ని సీరియల్స్ లో నటిస్తున్న ఆయన తాజాగా ఇద్దరు నిర్మాతల మీద పోలీస్ కేసు నమోదు చేయడం బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తన దగ్గర అప్పు తీసుకుని మోసం చేశారంటూ సాయికిరణ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మాత జాన్‌బాబు, లివింగ్ స్టన్‌లపూ తన దగ్గర రూ.10.6 లక్షలు అప్పుగా తీసుకుని మోసం చేశారని.. తనకు న్యాయం చేయాలంటూ సాయి కిరణ్ ఫిర్యాదు చేశాడు. పైగా డబ్బులు అడిగితే తనను బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సాయికిరణ్ ఫిర్యాదు మేరకు జాన్‌బాబు, లివింగ్ స్టన్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. వారిపై 420,406 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.