నటుడు శివాజీపై బీజేపీ కార్యకర్తల దాడి.. - MicTv.in - Telugu News
mictv telugu

నటుడు శివాజీపై బీజేపీ కార్యకర్తల దాడి..

February 21, 2018

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం  ఉద్యమిస్తున్న సినీనటుడు శివాజీరాజాపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. విజయవాడలో ఓ టీవీ చానల్ నిర్వహించిన  చర్చలో ఆయన మాట్లాడుతుండగా నిరసనకారులు దూసుకొచ్చి మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. హోదా విషయంలో శివాజీ బీజేపీని తూర్పారబడుతున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.

దాడికి ముందు శివాజీ చర్చలో మాట్లాడుతూ బీజేపీని, ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శారు. “మోదీ జీరో… మోదీ జీరో” అని నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు కూడా “శివాజీ డౌన్ డౌన్” అని ప్రతినినాదాలు చేశారు.  దీనికి శివాజీ మరింత ఘాటుగా స్పందిస్తూ.. ‘ప్రజలు మిమ్మల్ని ఇంకా మాట్లాడనిస్తున్నారు. ఇలాగే చేస్తూ పోతే ఊళ్ల నుంచి తరిమికొడతారు..’ అని అన్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు దూసుకొచ్చి ఆయపై దాడి చేశారు. అడ్డుకోబోయిన కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పద్మను తోసిపడేశారు.  

కుక్కలా తిరిగాను..

దాడి తర్వాత శివాజీ మాట్లాడుతూ.. తాను వెనక్కి తగ్గనని, ఇది తెలుగువాడి ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని అన్నారు. బీజేపీకి ఓట్లేయాలని 2014లో తాను కుక్కలా ఇల్లిల్లూ తిరిగి అడుక్కున్నానని గుర్తు చేశారు. ‘నామీద దాడి చేయండి  చంపండి. కానీ నా చావుకోసమైనా తెలుగువాళ్లంతా ఒక్కటై తిరగబడతారు’ అని హెచ్చరించారు.  బీజేపీ దాడులతో కొత్త చరిత్ర సృష్టిస్తోందని ఎద్దేవా చేశారు.