Actor SJ Suryah joins Ram Charan’s next film
mictv telugu

రామ్ చరణ్ విలన్‌ను పరిచయం చేసిన #RC15 టీమ్

September 9, 2022

రామ్‌ చరణ్ హీరోగా శంకర్ డైరెక్ష‌న్ లో దిల్ రాజు నిర్మిస్తున్న‌ హై బ‌డ్జెట్ మూవీ #RC15. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఎస్.జే. సూర్య లుక్ ని విడుదల చేసింది మూవీ యూనిట్. ద‌ర్శ‌కుడిగా కెరీర్ మొద‌లుపెట్టి ఆపై యాక్ట‌ర్‌గా మారాడు ఎస్.జే సూర్య‌. స్పైడర్, అదిరింది, మనాడు సినిమాల్లో హీరోయిజంతో పాటు విలనిజం కూడా బాగా ఎలివేట్ అయింది. ప్రతినాయకుడి పాత్రలో ఎస్.జే సూర్య నటించిన తీరు ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది.. రామ్‌చ‌ర‌ణ్, శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతున్న సినిమాలో ఎస్‌.జే సూర్య కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. కాగా, ఈ రోజు (శుక్ర‌వారం) నుంచి ఆయ‌న ఈ సినిమా షూటింగ్‌లో భాగ‌మ‌య్యారు. రామ్ చ‌ర‌ణ్‌కు ధీటుగా అత‌డి క్యారెక్ట‌ర్ సాగుతుందని చెబుతున్నారు.

పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమాలో ఎస్.జే సూర్య ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నాడని కోలీవుడ్ టాక్. ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విన‌య విధేయ రామ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌, కియారా అద్వాణీ జంట‌గా న‌టిస్తున్న సినిమా ఇది. శ్రీకాంత్‌, న‌వీన్‌చంద్ర కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.