ఇటీవల బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ విషాదాన్ని మరువక ముందే మరో యువ నటుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కర్ణాటకకు చెందిన ప్రముఖ టీవీ నటుడు సుశీల్ గౌడ(30) ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన సుశీల్ స్వస్థలం మండ్యలో మంగళవారం జరిగింది. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సుశీల్ ఆత్మహత్యకు పాల్పడటం అతని స్నేహితుల్లో, కన్నడ సినీ పరిశ్రమలో, టీవీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ‘అంతఃపుర’ అనే సీరియల్ ద్వారా సుశీల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే కన్నడ చిత్రాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తుండేవారు. నటుడు దునియా విజయ్ నటిస్తున్న తాజా చిత్రంలో సుశీల్ పోలీసు పాత్రలో నటించారు. అయితే ఆ చిత్రం విడుదలకు ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశీల్ ఆత్మహత్యపై నటుడు దునియా విజయ్ ఫేస్బుక్ ద్వారా స్పందించారు. ”నేను ఆయన్ని మొదటిసారి చూసినప్పుడు హీరో మెటీరియల్ అని అనిపించింది. మేం చేసిన సినిమా విడుదలకాక ముందే ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోవడం బాధాకరం. సమస్య ఏదైనా కానీ ఆత్మహత్య పరిష్కారం కాదు.” అని దునియా విజయ్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.