కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే చీఫ్ విజయకాంత్‌కు సంబంధించి గతకొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఆ పుకార్లను కొట్టివేస్తూ, డీఎండీకే నాయకులు విజయకాంత్ ఆరోగ్యానికి సంబంధించి, పలు విషయాలను వెల్లడించారు. ”విజయకాంత్ కుడి కాలి మూడు వేళ్లను వైద్యులు తొలగించారు. గతకొన్ని నెలలుగా ఆయన మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం కారణంగా ఆయన కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసర పరిస్థితిలో ఆ వేళ్లను తొలగించారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకండి. అభిమానులను, కార్యకర్తలు ఆందోళన చెందకండి” అని వారు కోరారు. తన స్నేహితుడి కుడి కాలి వేళ్లను వైద్యులు తొలగించారన్నా వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆవేదన చెందారు. విజయ్‌కాంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నటుడు విజయకాంత్.. తమిళ చిత్రసీమ సీనియర్ నటుల్లో ఆయన ఒకరు. రాజకీయాల్లో అడుగుపెట్టి 2005లో పార్టీ స్థాపించారు. ప్రజల్లో ఆయన పార్టీకి ఆదరణ పెరిగింది. దాంతో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే పోటీ చేసినప్పటికి ఏలాంటి ఫలితం రాలేదు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పార్టీ ప్రాముఖ్యత క్రమంగా తగ్గిపోయింది. ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో గత కొంతకాలంగా అటు రాజకీయాల్లో కానీ, ఇటు సినిమాల్లో కానీ ఆయన చురుకైన పాత్ర పోషించడం లేదు. కొన్ని సందర్భాల్లో తప్పితే బహిరంగంగా కనిపించడం కూడా తగ్గించేశారు. ప్రస్తుతం ఆయన భార్య ప్రేమలత, బావమరిది సుధీష్‌లు పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు.