Home > Featured > జనాలు థియేటర్స్‌కి ఎందుకు రావ‌టం లేదు?.. స‌మాధానమిదే అంటున్న నరేష్

జనాలు థియేటర్స్‌కి ఎందుకు రావ‌టం లేదు?.. స‌మాధానమిదే అంటున్న నరేష్

కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం మహమ్మారికి ముందు.. తర్వాత అన్నట్లుగా తయారైంది. ఆ సమయంలో థియేటర్లలో విడుదల చేసే పరిస్థితి లేక కొన్ని సినిమాలు ఓటీటీలలోనే విడుదలయ్యాయి. ప్రేక్షకులు వాటికి అలవాటు పడటం, కరోనా నుంచి కోలుకున్నాక కూడా థియేటర్లలో విడుదలైన కొన్ని సినిమాలు నిరాశ పరచడంతో జనాలు థియేటర్లకు రావడం తగ్గించారు. ఇక అప్పుడే కొందరు నిర్మాతల అత్యాశ.. థియేటర్ల యజమానుల పేరాశతో.. థియేటర్లలో సినిమాలు చూసే అనుభవాన్ని అంతకంతకు తగ్గించేసుకోవటమే కాదు.. థియేటర్ల వంక చూసే ఆలోచన కూడా చేయని పరిస్థితి నెలకొంది.

ఇలాంటి టైమ్ లో కల్యాణ్ రామ్ నటించిన బింబిసార.. సీతారామం.. కార్తికేయ 2 విజయాలు టాలీవుడ్ కు సరైన సంతోషాన్ని ఇచ్చాయని చెప్పాలి. అదే సమయంలో థియేటర్లు కూడా కళకళలాడిన పరిస్థితి. దీంతో.. ఇంతకాలం వరకు సాగిన ప్రచారాలు తప్పేనని తేలింది. ఓటీటీలు వచ్చాక జనాలు థియేటర్లకు రావటం మానేశారన్న మాట నూటికి నూరు శాతం నిజం కాదని తేలింది. ఎందుకంటే.. కంటెంట్ ఉండాలే కానీ థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేందుకు సిద్దంగా ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేసింది.

అ పరిస్థితుల్లో సీనియర్ నటుడు నరేశ్ చేసిన ట్వీట్లు ఆసక్తికరంగానే కాదు.. ఇండస్ట్రీ మొత్తం ఆయన గురించి మాట్లాడుకునేలా చేశాయి. అస‌లు ఇంత‌కీ అంత‌లా న‌రేష్ చేసిన ట్వీట్ ఏంటి? అనే వివ‌రాల్లోకి వెళితే.. ‘‘జనాలు థియేటర్స్‌కి ఎందుకు రావ‌టం లేదు? స‌మాధానం చాలా సింపుల్‌.. ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం థియేట‌ర్ ఎక్స్‌పీరియెన్స్ కోరుకుంటే రూ.2500 సుమారుగా ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. టికెట్ రేట్స్ అనేదే కార‌ణం కాదు. బ‌య‌ట రూ.20 లేదా రూ.30ల‌కు దొరికే పెప్సీ లేదా పాప్ కార్న్ థియేట‌ర్స్ ద‌గ్గ‌ర రూ.300ల‌కు అమ్ముతున్నారు. కాబ‌ట్టి జ‌నాలు మంచి సినిమానే కోరుకోవ‌టం లేదు.. మంచి అనుభ‌వాన్ని కూడా కోరుకుంటున్నారు. ఆలోచించండి’’ అని అన్నారు.

దీనికి కొనసాగింపుగా మరో ట్వీట్ చేసిన ఆయన.. " ఒకప్పుడు వారం రోజుల పాటు సినిమాలు చక్కగా ఆడేవి. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా రెండో రోజుకే థియేటర్ ఖాళీ అయిపోతుంది. ముందు థియేటర్లలో ఖర్చు తగ్గిస్తే జనాలు ఎక్కువసార్లు సినిమాలు చూసేందుకు వస్తారు" అని పేర్కొన్నారు.

Updated : 28 Aug 2022 1:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top