Actress Arya Ghare celebrated her birthday at the graveyard
mictv telugu

స్మశానంలో నటి పుట్టినరోజు వేడుకలు.. మంచిపనికే కానీ!

August 11, 2022

Actress Arya Ghare celebrated her birthday at the graveyard

సాధారణంగా పుట్టినరోజు వేడుకలు ఇంట్లోనో, పార్కులోనో, గుడిలోనే జరుపుకుంటారు. ధనవంతులైతే ఫైవ్ స్టార్ హోటల్, కొందరు విదేశాలకు కూడా వెళ్తుంటారు. కానీ, ఓ నటి మాత్రం వెరైటీగా స్మశానంలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ఇదేం పిచ్చి అంటారా? దానికి కూడా ఓ రీజనుంది. ఆ నటిపేరు ఆర్యా ఘరే. బాలనటిగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మరాఠీలో హీరోయిన్‌గా రాణిస్తోంది. తాను తాజాగా నటించిన చిత్రం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉందని, ఆ చిత్ర ప్రమోషన్లలో భాగంగానే డైరెక్టర్, నిర్మాత, తోటి నటీనటులతో 22వ పుట్టిన రోజు వేడుకలు స్మశానంలో జరుపుకుంటున్నానని వెల్లడించింది.

దెయ్యాలు ఉంటాయనే మూఢనమ్మకాలతో సమాజంపై పడుతున్న దుష్ప్రభావాన్ని అరికట్టే మంచి ఉద్దేశంతో ఈ పని చేసినట్టు పేర్కొంది. అంతేకాక, ఇటీవల నాగ్‌పూర్‌లో జరిగిన ఘటనను చెప్పుకొచ్చింది. దెయ్యం పట్టిందనే నెపంతో ఆరేళ్ల బాలికను విపరీతంగా కొట్టగా, దెబ్బలకు తాళలేక ఆ బాలిక చనిపోయింది. ఈ సంఘటన స్పూర్తితోనే ఇక్కడ వేడుకలు అంటూ స్పష్టం చేసింది. కాగా, దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు మంచిపని చేశారని మెచ్చుకుంటుంటే.. దెయ్యాలు లేవని చెప్పడానికి ఇంత సాహసం చేయాలా? అంటూ మరికొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు.