తెరపై అందంగా కనిపించే హీరోయిన్లు అందుకోసం సర్జరీలు, ఇంజెక్షన్లను తీసుకుంటారనే వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. కొందరు హీరోయిన్లు అవకాశాలు రావడం కోసం శరీర భాగాలు పెరిగేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు, ముక్కు మూతి ఆకర్షణీయంగా లేకపోతే ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. 16 ఏళ్ళ వయసులో దేశముదురు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక మీద కూడా అలాంటి ఆరోపణలు గతంలో వచ్చాయి. అలాంటి ఆరోపణలకు క్లారిటీ ఇచ్చింది హన్సిక. ఈమె ఇటీవలే తన స్నేహితుడిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ వీడియో హాట్‌స్టార్‌లో లవ్ షాదీ డ్రామా పేరుతో ప్రసారమవుతోంది.
ఈ వీడియోలో ఇంజెక్షన్ల విషయాన్ని ప్రస్తావిస్తూ రూమర్లను కొట్టిపారేసింది. ‘సెలబ్రిటీలుగా కొనసాగడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. 21 ఏళ్ళ వయసులో నా గురించి కొందరు చెత్త వాగుడు వాగారు. నేనే ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో మీకు అర్ధం అయిందనుకుంటా. చాలా మంది త్వరగా పెరిగేందుకు నేను హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకున్నానని రాశారు. 8 ఏళ్లకే నటిని కావడంతో మా అమ్మ నాకు హార్మోనల్ ఇంజెక్షన్ ఇచ్చి తొందరగా పెద్దది చేసిందని మాట్లాడుకున్నారు. అది నిజం కాదు’ అని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. వెంటనే ఆమె తల్లి అందుకుంటూ ‘అదే నిజమైతే నేను టాటా, బిర్లాల కంటే ఎక్కువ ధనవంతురాలయ్యేదాన్ని. మీరంతా ఆ ఇంజెక్షన్ కోసం నా దగ్గర క్యూ కట్టేవారు. ఇంత దారుణంగా రాయడానికి కనీసం కామన్ సెన్స్ అయినా వాడరా? అని ఒకింత కోపంతో మాట్లాడింది. కాగా, తన స్నేహితురాలి మాజీ భర్తనే హన్సిక పెళ్లి చేసుకుంది. దాంతో మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. వారిద్దరి విడాకులకు కారణం హన్సికనే అని, ఆమె మాజీ భర్తను పెళ్లి చేసుకొని స్నేహితురాలికి నమ్మక ద్రోహం చేసిందని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాని గురించి హన్సిక క్లారిటీ ఇచ్చింది. తన భర్త గతం తెలుసని చెప్తూనే వారి విడాకులకు కారణం నేను కాదని తేల్చి చెప్పేసింది.