actress Jayaprada met President Draupadi Murmu in Delhi
mictv telugu

కొడుకు, కోడలితో రాష్ట్రపతిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన జయప్రద

July 31, 2022

రాష్ట్రపతిగా మన దేశపు అత్యున్నత పీఠం అధిష్టించిన ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు మాజీ రాజ్యసభ సభ్యురాలు, ప్రముఖ నటి జయప్రద. కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి భవన్ లో ప్రథమ మహిళను కలిసిన జయప్రద… ఆమె పదవీకాలం జయప్రదం కావాలని ఆకాంక్షించారు. జయప్రద, ఆమె కుమారుడు సిద్ధార్థ, కోడలు రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి ద్రౌపది ముర్మును జయప్రద కలసిన ఫొటోలు వైర‌ల్ గా మారాయి. ప్రస్తుతం జయప్రద బీజేపీలో క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారు.

కాగా జయప్రద అసలు పేరు లలితారాణి. 1959 ఏప్రిల్ 3 న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించిన లలితారాణి.. తన స్కూల్ వార్షికోత్సవంలో ఇచ్చిన డాన్స్ పెర్ఫామన్స్ కారణంగా సినిమాలో చాన్స్ వచ్చింది. ఆమె డాన్స్ చూసిన నటుడు ప్రభాకర రెడ్డి ‘భూమి కోసం’ చిత్రంలో ఓ పాటలో డ్యాన్స్ చేసే అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంతో లలితా రాణి జయప్రదగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత బాలచందర్ దర్శకత్వంలో చేసిన ‘అంతులేని కథ’, కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన ‘సిరిసిరి మువ్వ’ వంటి చిత్రాలు ఆమె సినీ జీవితానికి రెడ్ కార్పెట్ పరచి, స్వాగతం పలికాయి.