'మోదీజీ..దక్షిణాదిపై ఎందుకీ అసమానత?'..ఖుష్బూ - MicTv.in - Telugu News
mictv telugu

‘మోదీజీ..దక్షిణాదిపై ఎందుకీ అసమానత?’..ఖుష్బూ

October 21, 2019

Actress kushboo tweet to prime minister narendra modi.

మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి గాంధీ ఆశయాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా సినిమాల ద్వారా గాంధీ మహాత్ముడి ఆశయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని లోక కళ్యాణ్‌ మార్గ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అమీర్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌, కంగనా రనౌత్‌ సహా పలువురు ఉత్తరాది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబందించిన ఫోటోలను మోదీ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. 

ఈ కార్యక్రమంపై దక్షిణాది సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ దక్షిణాది సినీ ప్రముఖుల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికే రాంచరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్ ద్వారా స్పందించిన సంగతి తెల్సిందే. తాజాగా ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ ఈ అంశమై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఇలాంటి కార్యక్రమానికి దక్షిణాది పరిశ్రమ నుంచి ఒక్క కళాకారుడిని కూడా ఆహ్వానించకపోవటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. దక్షిణాది సినిమా ప్రపంచవ్యాప్తంగా దేశాన ఘనతను చాటుతుందన్నారు. సినిమాల్లో ఉత్తమ ప్రతిభ దక్షిణాది నుంచే వస్తోందని తెలిపారు. ఇండియాలో పెద్ద స్టార్లు సౌత్ ఇండియాలోనే ఉన్నారన్నారు. దక్షిణాది సినీ ప్రముఖులను ఎందుకు ఆహ్వానించలేదు? ఎందుకీ అసమానత అని విమర్శించారు. ఖుష్బూ ట్వీట్‌కు సినీ అభిమానులతో పాటు సామాన్యుల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దుతు లభిస్తోంది.