ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ (48) మంగళవారం రాత్రి మృతి చెందారు. గతకొన్ని నెలలుగా అనారోగ్యం బారినపడిన విద్యాసాగర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, చెన్నైలో మృతి చెందారు. విద్యాసాగర్ బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
2009లో ఆయన మీనాను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. జనవరి నెలలో మీనా కుటుంబం కరోనా బారినపడింది. ఆ తర్వాత వారు కోలుకున్నప్పటికీ విద్యాసాగర్ మాత్రం లివర్ ఇన్ఫెక్షన్కు గురై, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అది మరింత తీవ్రం కావడంతో చెన్నైలోని ఆసుపత్రిలో చేర్చారు. దాంతో వైద్యులు.. ఆయనకు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని నిర్ణయించారు. కానీ, అది కుదరలేదు. అంతలోనే ఆయన ఆరోగ్యం ఇంకా విషమించడంతో గత రాత్రి కన్నుమూసినట్లు వైద్యులు నిర్థారించారు. విద్యాసాగర్ మరణవార్తను తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలోపాటు, తమిళ, కన్నడ పరిశ్రమలు నివాళులు అర్పించాయి. విద్యాసాగర్ అంత్యక్రియలు నేడు చెన్నైలో జరగనున్నాయి.
మీనా..బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అనతికాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో హీరోయిన్గా నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఇక దృశ్యం సినిమాలో మదర్ క్యారెక్టర్స్ చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం మీనా సీనియర్ హీరోల పక్కన చేస్తూ, బిజీ బిజీగా ఉంది. ఇటువంటి సమయంలో ఆమె భర్త మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.