సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ గత కొద్దిరోజుల నుంచి మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని నరేష్ మూడో భార్య రమ్య వారిద్దరూ కలిసి ఉన్న హోటల్ వద్దకు వెళ్లి వారి మీద దాడి చేయటానికి ప్రయత్నించడం సంచలనంగా మారింది. అయితే పవిత్ర లోకేష్.. కన్నడ మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఇంతకు ముందు పెళ్లి కాలేదని, సుచేంద్ర ప్రసాద్ అనే వ్యక్తితో సహజీవనం చేసినట్లు తెలిపింది. ఈ వార్తలపై సుచేంద్ర ప్రసాద్ స్పందించారు. పవిత్ర లోకేశ్ తన భార్య అంటూ చెప్పుకొచ్చారు. అసలు నరేష్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని తాజాగా కన్నడ మీడియాకు తెలిపారు.
తన భార్యతో సంబంధాలపై మీడియా, కొంతమంది స్నేహితుల ద్వారా తెలుసుకున్నానని సుచేంద్ర ప్రసాద్ అన్నారు. పవిత్ర చెప్పినట్టు తాము సహజీవనం చేయడం నిజం కాదని 16 ఏళ్ల క్రితం హిందూ వివాహచట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నామని తెలిపారు. తామిద్దరం దంపతులమని రుజువు చేసే ఆధారాలు ఉన్నాయని కూడా ఆయన వివరించారు. తన పాస్‌పోర్టులో భార్యగా పవిత్ర పేరు, అలాగే ఆమె పాస్‌పోర్టులో భర్తగా తన పేరు నమోదైనట్టు సుచేంద్ర ప్రసాద్ చెప్పారు. ఆధార్‌కార్డులో కూడా భార్య భర్తలుగా తమ పేర్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. అలాగే తమ ప్రేమకు, దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారన్నారు. అంతేకాక తాను పవిత్రను ఉద్దేశించి ఏవో కామెంట్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోందని, తాను ఎక్కడా ఎలాంటి అభ్యంతరకర కామెంట్స్ చేయలేదని సుచేంద్ర ప్రసాద్ వెల్లడించారు. పవిత్రపై తనకు ఇప్పటికీ గౌరవం ఉందని, దీని వెనుక ఎవరున్నారో కూడా తెలియదన్నారు. ఇక ఈ విషయం మీద పవిత్ర ఎలా స్పందిస్తారు అన్నది తెలియాల్సి ఉంది.