నటి లైంగిక ఆరోపణలపై అనురాగ్ కశ్యప్‌ వివరణ - MicTv.in - Telugu News
mictv telugu

నటి లైంగిక ఆరోపణలపై అనురాగ్ కశ్యప్‌ వివరణ

September 20, 2020

bcgnvc b

రెండేళ్ల క్రితం సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. పెద్ద ఎత్తున నటీమణులు మీడియా ముందుకు వచ్చి సినీ పరిశ్రమలో తమపై జరిగిన లైంగిక దాడులను వెల్లడించారు. తాజాగా మరో బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ తనపై జరిగిన లైంగిక దాడి గురించి గళం విప్పింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని, తన దుస్తులను విప్పాలని చూశాడని తెలిపింది. అతడి నుంచి తనకు ప్రాణహాని ఉందని వాపోయింది. తనను కాపాడాలని కోరుతూ, ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ పాయల్ ఓ ట్వీట్ కూడా పెట్టింది. దీనిపై అనురాగ్ కశ్యప్ ఘాటుగా స్పందించాడు. పాయల్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, ఆమె ఆరోపణలు నిరాధారమని వెల్లడించాడు. తన పరువుకు భంగం కలిగించడానికే ఆమె ఈ తరహా ఆరోపణలు చేస్తుందన్నాడు.

అనురాగ్ కశ్యప్.. రణబీర్ కపూర్‌తో ‘బాంబే వెల్వెట్’ సినిమా రూపొందిస్తునప్పుడు ఈ సంఘటన జరిగిందని పాయల్ తెలిపింది. ఓ రోజు అనురాగ్ ఫోన్ చేసి తనతో మాట్లాడాలని ఉందని పిలిచాడని వెల్లడించింది. ఆ మరుసటి రోజు ఆయనింటికి వెళ్లానని చెప్పింది. అప్పటికే పీకల దాకా తాగివున్న అనురాగ్ తనను గదిలోకి తీసుకెళ్లి తన బట్టలు విప్పబోయాడని సంచలన ఆరోపణలు చేసింది. తాను తీవ్రంగా ప్రతిఘటించగా, బాలీవుడ్‌లో ఇవన్నీ సర్వ సాధారణమేనని అన్నాడని తెలిపింది. రణబీర్‌తో నటించాలంటే, తనతో సన్నిహితంగా ఉండాల్సిందేనని, అందుకు ఏ అమ్మాయి అయినా అంగీకరిస్తుందని కూడా చెప్పాడని పాయల్ ఆరోపించింది. ప్రస్తుతం పాయల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు పెద్ద ఎత్తున పాయల్ కి మద్దతుగా నిలుస్తున్నారు.