జయం వంటి సూపర్ హిట్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అపరిచితుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో మెప్పు పొందిన హీరోయిన్ సదా ఓ సినిమా చూస్తూ థియేటర్లోనే ఏడ్చేసింది. సినిమా అయిపోయిన తర్వాత బయటికి వచ్చి అందుకు గల కారణాన్ని మీడియాకు వివరించింది. అడవిశేష్ కథానాయకుడిగా మహేశ్ బాబు నిర్మాణంలో వచ్చిన చిత్రం ‘మేజర్’. ఈ చిత్రాన్ని చూసిన సదా.. అందులోని సన్నివేశాలకు థియేటర్లోనే కన్నీరు కార్చారు.
అనంతరం బయటికి వచ్చి తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా వచ్చిన ఈ చిత్రం పస్టాఫ్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. ప్రతీ ఒక్కరూ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఉగ్రవాదులు బాంబు దాడి చేసినప్పుడు ముంబైలోనే ఉన్నాను. ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే ఆ రోజులు గుర్తుకు వచ్చాయి. కొన్ని సీన్లయితే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. దర్శకుడు కథను నడిపించిన విధానం, శేష్ నటన అందరినీ మెప్పిస్తాయ’ని ప్రశంసించారు.