మిగతా హీరోయిన్లకు భిన్నంగా.. నటనకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సాయిపల్లవి. ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసేసిన ఈ సహజ నటి.. త్వరలో విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రానాకు జంటగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో 1990ల్లోని ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17న(శుక్రవారం) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. కొన్ని విషయాలను పంచుకుంది. నటిగా ఇప్పటివరకూ తాను చేసిన పాత్రలన్నీ తనకు సంతృప్తినిచ్చాయని పేర్కొంది. ఇక తనను ఒక వీడియో చాలా ఇబ్బంది పెట్టిందని, అప్పట్నుంచి కురచ దుస్తులు వేసుకోవడం మానేశానని చెప్పుకొచ్చింది.
“డాక్టర్ కోర్సు చదవటానికి జార్జియా వెళ్లినప్పుడు అక్కడ టాంగో డ్యాన్స్ నేర్చుకున్నాను. ఆ డ్యాన్స్ నేర్చుకోవాలంటే.. దానికి వీలుగా ఉండే దుస్తులే ధరించాలి. ఇంట్లో అమ్మ, నాన్నల పర్మిషన్ తీసుకొని, ఆ దుస్తులు నాకు సౌకర్యంగానే ఉంటాయని అనిపించాకే ఆ డ్యాన్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాతే ప్రేమమ్ లో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నా పాత్రకు చాలా ప్రశంసలు వచ్చాయి. కానీ అదే సమయంలో జార్జియాలో టాంగో డ్యాన్స్ చేసిన సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోపై నెటిజన్లు చేసిన కామెంట్లు చాలా ఇబ్బందిగా అనిపించాయి. ఆ క్షణం నుంచి పొట్టి దుస్తులు వేసుకోకూడదనుకున్నాను. అందుకే ఏ సినిమాలోనూ కురచ దుస్తులు వేసుకోనని ముందే చెప్తాను” అని సాయిపల్లవి తెలిపింది.