తన నటన, నాట్యంతో ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయిపల్లవి తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తను నటించిన నక్సలైటు కథా చిత్రం విరాటపర్వం సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది సాయి పల్లవి. ఈ క్రమంలో ఎదురైన ఓ ప్రశ్నకు జవాబిస్తూ కశ్నీరీ పండిట్లు, గోవుల పేరుతో ముస్లింల హత్య వంటి అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. దాంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. విరాటపర్వం సినిమాను బాయ్‌కాట్ చేస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇంటర్వ్యూలో యాంకర్, నక్సలిజానికి, టెర్రరిజానికి ఏంటీ తేడా? అని ప్రశ్నించగా, ‘పాక్ వాళ్లు మన సైనికులను చూసి శత్రువులుగా భావిస్తారు.
అలాగే మనం కూడా. ఇదంతా మనం చూసే దృష్టితో ముడిపడి ఉంటుంది. అంతేకానీ, ఎవ్వరూ ఎవరికీ శత్రువు కాదు. నక్సలైట్ విషయానికొస్తే అన్యాయం జరిగిన వ్యక్తుల గుంపు అది. తమకు న్యాయం ఈ పద్ధతిలోనే జరుగుతుందని భావించి అందుకోసం కృషి చేశారు. అందులో వారు సక్సెస్ అయ్యారా? లేదా? అంటే వారికి తెలిసిన పద్ధతిలో వారు పోరాడారు’ అని అభిప్రాయపడింది. అదే క్రమంలో ‘ఇటీవల కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశాను. అందులో 1990లో పండిట్లను ఊచకోత కోసిన ఘటన చూపించారు. కానీ, ఇటీవల లాక్ డౌన్ సమయంలో ఉత్తరాదిన గోవులను తరలిస్తున్నాడని ఓ ముస్లిం డ్రైవరుని కొట్టి చంపేశారు. జై శ్రీరామ్ అనమని ఒత్తిడి తెచ్చిన వీడియోలు మనం చూశాం. 30 ఏళ్ల క్రితం జరిగిన పండిట్ల హత్య, ఇప్పుడు జరిగిన హత్యలకు తేడా ఏముంది? అంటూ ప్రశ్నించింది. దీంతో ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కరెక్టుగా చెప్పారంటూ కొందరు, ఈమెకు చరిత్ర తెలియదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరైతే విరాట పర్వం సినిమాను బాయ్ కాట్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. మరి ఈ వివాదంపై సాయి పల్లవి ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా, విరాటపర్వం సినిమా జూన్ 17న విడుదల కానుంది.