శారదకు నిర్మాత షాక్.. 40 ఏళ్ల తర్వాత డబ్బు తెచ్చి..  - MicTv.in - Telugu News
mictv telugu

శారదకు నిర్మాత షాక్.. 40 ఏళ్ల తర్వాత డబ్బు తెచ్చి.. 

October 18, 2019

actress Sharada's debt was repaid by producer

సినీ పరిశ్రమలో నిర్మాతలు పారితోషకాలు ఎగొట్టారు అని నటీనటులు వాపోతుంటారు. కానీ, ఓ సినీ నిర్మాత మాత్రం 40 ఏళ్ళ కిందటి బాకీని బాగా గుర్తుపెట్టుకుని మరీ తీర్చేశాడు. ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటి శారద 1979లో ‘పుష్యరాగం’ అనే మలయాళీ సినిమాలో నటించారు. ఈ సినిమా నిర్మాత ఆంటోనీ అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల శారదకు పూర్తి పారితోషకం ఇవ్వలేకపోయారు. ఆ తరువాత రెండు సినిమాలను నిర్మించిన ఆంటోనీ లాభాలు చూడలేదు. అలా నాలుగు దశాబ్దాలు గడిచిపోయాయి. ఆంటోని ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. కానీ, శారదకు పూర్తిగా పారితోషకం ఇవ్వలేకపోయాననే బాధ అలాగే ఉండి పోయింది. దీంతో ఎలాగైనా శారదకు పూర్తి పారితోషకం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

శారద ‘ఆది మక్కళ్‌’ అనే సినిమా 50 సంవత్సరాల వేడుకకు ముఖ్య అతిథిగా ఎర్నాకులం వస్తున్నారని తెలుసుకున్నారు. అక్కడే ఆమెను కలిసి మిగిలిన పారితోషకం ఇవ్వాలనుకుని ఆ కార్యక్రమానికి వెళ్ళారు. శారదా తనతో సినిమా నిర్మించిన నిర్మాత ఆంటోనీని గుర్తుపట్టి యోగక్షేమాలు అడిగారు. మాటల మధ్యలో ఆంటోనీ మిగిలిన పారితోషికాన్ని అందజేశారు. మిగిలిన పారితోషికం అందించడానికే ఆయన వచ్చారని తెలిసి శారద ఆశ్చర్యపోయారు. ఆమెకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చాక ఆంటోని మనసు కుదుటపడింది. అలా నలభై ఏళ్లకు ఆంటోని తన బాకీ తీర్చుకున్నారు.