మాస్కుల్లోనే రెచ్చిపోయారు.. మీ దుంపతెగ..  - MicTv.in - Telugu News
mictv telugu

మాస్కుల్లోనే రెచ్చిపోయారు.. మీ దుంపతెగ.. 

March 23, 2020

Nandini

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కి దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. ప్రజలు అందరూ ఒక్కతాటి మీద ఉండి, ఇళ్లకే పరిమితం అయ్యారు. సాయంత్రం 5 గంటలకు ఇళ్లనుంచి అందరూ బయటకు వచ్చి వైద్యులు, పారిశుద్య కార్మికులకు చప్పట్లు చరిచి జేజేలు పలికారు. ప్రజల తీరుపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ఓ నటి మాత్రం కరోనా కారణంగా రొమాన్స్‌ని ఆపలేం అంటూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ‘నందిని’ సీరియల్‌ ద్వారా పాపులర్‌ అయిన బుల్లితెర నటి నిత్యారామ్‌ ఆ ఫోటోను షేర్ చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన గౌతమ్‌ అనే వ్యాపారస్తుడిని నిత్య వివాహం చేసుకుంది. ఆ ఫోటోలో మాస్కులు ధరించిన ఆమె, ఆమె ప్రియుడు ముద్దు పెట్టుకుంటున్నారు. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ ఫోటోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఎంత తెలివితక్కువగా ప్రవర్తిస్తున్నావ్. సీరియస్ ఇష్యూ నడుస్తుంటే నువ్విలా హాట్ ఫోటో పెట్టి అపహాస్యం చేస్తావా? ఒక నటిగా నీ బాధ్యత ఇదా?’ అని ఓ యూజర్ మండిపడ్డారు. ‘ఇలాంటివి నాలుగు గోడల మధ్య ఉంటేనే అందంగా ఉంటుంది. ఇలా రచ్చకెక్కడం.. అందునా దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫోటోలు పెట్టి ఏం సాధించాలనుకుంటున్నావ్? నీ మీద ఉన్న ఆకాస్త అభిమానం కూడా పోయింది’ అంటూ మరికొందరు యూజర్లు కామెంట్లు చేశారు. కాగా, కరోనా వైరస్ కారణంగా సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. భార్యాభర్తలు అయినా శృంగారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిత్య తన ప్రియుడిని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేయడం సంచలనంగా మారింది.