Actress Varalakshmi Sarathkumar Serious on those who give movie reviews on social media.
mictv telugu

సినిమా హిట్టు లేదా ఫ్లాప్‌ అని చెప్పడానికి మీరెవరు?.. వరలక్ష్మి సీరియస్

February 12, 2023

Actress Varalakshmi Sarathkumar Serious on those who give movie reviews on social media.

క్రాక్ సినిమాలో జయమ్మగా విలనిజం పండించిన వరలక్ష్మి శరత్‌కుమార్.. తాజాగా సంక్రాంతికి విడుదలైన వీరసింహ రెడ్డిలో కూడా పవర్ రోల్ పాత్రలో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆమె నటనకు అంతా ఫిదా అయ్యారు. ఇక ఆమె నటించిన రీసెంట్‌ తమిళ చిత్రం ‘కొండ్రల్‌ పావమ్‌’. తెలుగులో విడుదలైన ‘అనగనగా ఓ అతిథి’కి రీమేక్‌గా ఇది సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె రివ్యూవర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘కొత్త సినిమాలు రిలీజైన వెంటనే కొంతమంది యూట్యూబ్‌లోనో లేదంటే సోషల్‌మీడియాలోనో ఇష్టమొచ్చినట్లు రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఈ సినిమాలో ఇది బాలేదు… అది బాలేదు.. అసలు సందేశమే లేదు అని ఏవేవో చెప్పేస్తున్నారు. దీనివల్ల సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లకముందే దెబ్బతింటోంది. సినిమా రిలీజ్ అవ్వడమే ఆలస్యం.. ప్లస్‌లు, మైనస్‌లు అంటూ ఏదో రివ్యూలు ఇస్తున్నారు. అలాంటి వాళ్లందర్నీ నేను అడిగేది ఒక్కటే.. అసలు మీరు సినిమా నుంచి ఏం ఆశిస్తున్నారు?. ఎందుకంటే మొదట్లో అందరూ సినిమాని వినోదం కోసం చూసేవాళ్లు. ఇప్పుడు ఎంజాయ్‌ చేయడం మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

సోషల్‌మీడియాలో ఇది మరీ ఎక్కువైపోయింది. కొన్నిసార్లు, వాళ్లిచ్చే రివ్యూలు అర్థంపర్థం లేకుండా ఉంటున్నాయి. సినిమా హిట్టు లేదా ఫ్లాప్‌ అని చెప్పడానికి మీరెవరు? అది బాగుందా? లేదా? అనేది ప్రేక్షకులను నిర్ణయించనివ్వండి. సినిమా రివ్యూ చెప్పేవాళ్లకు కనీసం ఒక బ్యాక్‌గ్రౌండ్‌ ఉండాలి. మీరు రివ్యూలు ఇవ్వాలనుకుంటే సినిమా విడుదలైన ఐదారు రోజుల తర్వాత చెప్పండి. ప్రేక్షకులకు సినిమాని చూసి ఆనందించే అవకాశం కల్పించండి. ఇదొక్కటే నా విన్నపం. అలాగే, కొంతమంది సినిమా కలెక్షన్స్‌ గురించి నెట్టింటి వేదికగా వాగ్వాదాలకు దిగుతున్నారు. ఇవన్నీ ఎందుకు? జీవితం చాలా చిన్నది దాన్ని ఎంజాయ్‌ చేయండి’’ అని వరలక్ష్మి అన్నారు.