తనిష్క్ జ్యువెలరీ యాడ్‌పై రచ్చ.. లవ్ జిహదీ అంటూ..  - MicTv.in - Telugu News
mictv telugu

తనిష్క్ జ్యువెలరీ యాడ్‌పై రచ్చ.. లవ్ జిహదీ అంటూ.. 

October 12, 2020

Ad Celebrating Love Between Hindu-Muslim Communities Faces Outrage. But Why?

ఈమధ్య సామాజిక కోణంలో తీస్తున్న కొన్ని యాడ్స్ వివాదాస్పదం అవుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో సర్ఫ్ ఎక్సెల్ హిందూ ముస్లింలను దగ్గర చేస్తుందనే థీమ్‌తో హోళీ యాడ్ చేయగా అది ఎంత కాంట్రవర్సీ అయిందో తెలిసిందే. అలాగే సామ్‌సంగ్ యాడ్ కూడా వివాదాన్ని మూటగట్టుకుంది. మరోవైపు ‘కూలెస్ట్ మంకీ ది జంగిల్’ పేరిట వచ్చిన ఓ యాడ్‌లో తెల్లజాతీయులు, నల్లజాతీయులను అవమానించారని రచ్చ రచ్చ అయింది. తాజాగా అలాంటి యాడ్ విషయంలో మరో వివాదం తెరమీదకు వచ్చింది. ప్రముఖ జ్యూవెలరీ సంస్థ తనిష్క్‌ తాజాగా విడుదల చేసిన ప్రచార వీడియో ‘లవ్ జిహాదీ’ని ప్రమోట్ చేసే విధంగా ఉందని కొందరు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ట్విటర్‌లో ‘బాయ్‌కాట్ తనిష్క్’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంది.

వచ్చే పండగ సీజన్ సందర్భంగా తనిష్క్ ఓ వ్యాపార ప్రకటనకు సంబంధించి వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ముస్లిం కుటుంబంలో హిందూ కోడలిని చూపించారు. వారి మధ్య అనుబంధాలను, ఆప్యాయతలను చూపించారు. ‘ఆమె తన సొంత బిడ్డలాగ ప్రేమించే కుటుంబంలోకి వచ్చింది. వారు సాధారణంగా జరుపుకోని సందర్భాన్ని ఆమె కోసం ఓ వేడుకలా జరుపుకుంటున్నారు. సంప్రదాయాలు, సంస్కృతులు వేర్వేరు అయినా రెండు మతాల అందమైన సంగమం ఇది’ అని తనిష్క్ ఆ వీడియోలో చెప్పింది. ఇందులో రెండు వర్గాల మధ్య సఖ్యతను వివరించినట్టు తనిష్క్ భావించింది కానీ, కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. దేశంలో ‘లవ్ జిహాదీ’కి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ వీడియో ఉందని నెటిజెన్లు నిప్పులు చెరుగుతున్నారు. ప్రతిసారి ముస్లిం కుటుంబంలో హిందూ కోడళ్లనే చూపిస్తున్నారని, హిందూ కుటుంబంలో ముస్లిం కోడళ్లను చూపించడం లేదని కొందరు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. అలాంటి యాడ్ చేయండి అని సూచనలు ఇస్తున్నారు. ‘ఆ యాడ్‌లో హిందూ సంప్రదాయాలను ముస్లింలు గౌరవించాలనే కదా చెప్పారు’ అని మరికొందరు ఆ యాడ్‌కు మద్దతు పలుకుతున్నారు.