గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కంపెనీలు ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నాయి. హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికతో ఆ గ్రూప్ కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. దాంతో టాప్ 3 కుబేరుల లిస్టు నుంచి అదానీ టాప్ 20 బయటకి వెళ్లిపోయాడు. ఈ అంశం పార్లమెంటులో కూడా దుమారం రేపింది. ప్రధాని మోదీ అదానీకి దేశాన్ని దోచిపెడుతున్నారంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. అటు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలవగా, ఈ పరిణామాలు పునరావృతం అవకుండా తగిన నిబంధనలు రూపొందించడానికి ప్రత్యేక కమిటీని నియమించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది.
ఈ పరిణామాలతో దేశ ప్రజల్లో కూడా అదానీకి మోదీ మద్ధతుగా ఉన్నారనే అభిప్రాయం నెలకొన్నట్టు కనిపిస్తోంది. నిజానిజాలు ఎలా ఉన్నా అదానీ గ్రూప్ భారీగా నష్టపోవడం మాత్రం జరిగింది. ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ మాత్రం అద్దిరిపోయే లాభాలాను ఆర్జించింది. 2022 – 23 ఆర్ధిక సంవత్సరం క్యూ 3లో ఆ కంపెనీ నికర లాభం రూ. 820 కోట్లను సంపాదించింది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే సమయంలో రూ. 11.63 కోట్ల నష్టం రావడం గమనార్హం. ఇక క్యూ 3లో కంపెనీ ఆదాయం కూడా భారీగా 42 శాతం పెరిగి రూ. 26 వేల 612 కోట్లకు చేరింది. గతేడాది రూ. 18 వేల 757 కోట్లుగా మాత్రమే ఉంది. ఈ ఫలితాలు బ్లూమ్‌బర్గ్ అంచనాలను మించి ఉండడం మరో విశేషం.