Adani group overtakes Tatas to be India's most valued conglomerate
mictv telugu

టాటా సంస్థలను పక్కకు నెట్టేసిన అదానీ గ్రూప్

September 17, 2022

Adani group overtakes Tatas to be India's most valued conglomerate

దేశంలో అత్యంత విలువైన వ్యాపార దిగ్గజమైన టాటా గ్రూప్‌ను.. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కంపెనీలు దాటేశాయి. దలాల్ స్ట్రీట్‌లో అదానీ గ్రూప్ కంపెనీలు ర్యాలీ చేయడంతో.. టాటాలను అదానీ వెనక్కి నెట్టారు. శుక్రవారం మార్కెట్ క్లోజింగ్‌లో.. అదానీ గ్రూప్ కంపెనీల అన్ని లిస్టెడ్ స్టాక్స్ వాల్యూ రూ.22.27 లక్షల కోట్లకు ఎగిసింది. టాటా గ్రూప్ కంపెనీల వాల్యూ రూ.20.77 లక్షల కోట్లుగా ఉంది. అదానీ గ్రూప్ కంపెనీలు, టాటాల తర్వాత.. మూడో స్థానంలో రిలయన్స్ గ్రూప్ నిలిచింది. అదానీ వ్యాపారాలు భారీగా పెరుగుతుండటంతో.. మార్కెట్లో ఆయన కంపెనీలు ర్యాలీ చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను కూడా అధిగమించి ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచారు అదానీ. ప్రస్తుతం అదానీ పక్కన టెస్లా అధినేత ఎలోన్ మస్క్ మాత్రమే మిగిలి ఉన్నాడు.

1988 వ సంవత్సరంలో అదానీ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించారు గౌతమ్ అదానీ ప్రారంభించారు. కమోడిటీస్ ట్రేడింగ్ వ్యాపారంతో ప్రారంభించిన ఆ సంస్థ ఇప్పుడు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ గా మారింది. గత రెండు దశాబ్దాలలో, ఈ కంపెనీ అనేక వ్యాపారాలలోకి ప్రవేశించింది. గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌లు, కొనుగోళ్లు, జాయింట్ వెంచర్‌ల ద్వారా కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించింది. అంబుజా, ఏసీసీ సిమెంట్‌ కంపెనీలను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేయడం ఈ గ్రూప్‌ అగ్రస్థానానికి బాగా కలిసొచ్చింది. అదానీ గ్రూప్‌నకు చెందిన మార్కెట్‌ విలువ ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ.10.16 లక్షల కోట్ల మేర పెరగ్గా.. టాటా గ్రూప్‌ మార్కెట్‌ వాటా రూ.2.57 లక్షల కోట్ల మేర తగ్గింది.