భారత టెలికాం రంగంలో మరో సంచలనానికి నాంది పడనుంది. ప్రస్తుతం భారతీయ టెలికం రంగాన్ని ఏలుతోన్న అంబానీ, మిట్టల్‌ను ఢీకొట్టేందుకు వ్యాపార దిగ్గజం, అపర కుబేరుడు గౌతమ్ అదానీ సిద్ధమవుతున్నారు. త్వరలో నిర్వహించనున్న 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొని టెలికం రంగంలోకి అడుగుపెట్టడానికి అదానీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అదానీ సంస్థ స్పెక్ట్రం వేలానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
4జీ కంటే 10 రెట్ల వేగంతో డేటా ట్రాన్సఫర్‌కి వీలున్న, వినూత్న సేవలందించేందుకు అనువైన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయమై అదానీ గ్రూప్ ఎటువంటి ప్రకటనా చేయలేదు. స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అధికారికంగా ఈనెల 12న వెల్లడవుతాయి.
దాదాపు రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72,097.85 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ వేలం జూలై 26 నుంచి జరగనుంది. ఒకవేళ అదానీ టెలికం రంగంలోకి అడుగుపెడితే ఈ రంగంలో పోటీ పెరిగే అవకాశం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏదు. గుజరాత్‌కు అంబానీ, అదానీలు ఇప్పటి వరకు ఒకే రంగంలో ఎన్నడూ పోటీ పడలేదు. ఇద్దరూ వారు ఎంచుకున్న రంగాల్లో భారీ వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించారు. అయితే తొలిసారి టెలికం రంగంతో ఈ పోటీ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.