ఆదానీ కంపెనీల షేర్లు ఇప్పట్లో సంక్షోభం నుంచి బయటపడేలా కనిపించడం లేదు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు హిండెన్‌బర్గ్ నివేదికతో అతలాకుతలమైన షేర్లకు మరో దెబ్బ తగిలింది. ప్రముఖ ఆర్థిక మదింపు సంస్థ మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషన్ (MSCI) సూచీల్లో ఆదానీ గ్రూప్ వెయిటేజీ తగ్గడంతో శుక్రవారం షేర్ల విలువ మళ్లీ పతనమైంది. రూ. 9 వేల కోట్ల రుణాలను ముందుగా చెల్లిస్తామని చెప్పడంతో నెమ్మదిగా ఊపందుకుందుకన్న షేర్లు విలువ ఈ సూచీతో మళ్లీ తగ్గుతోంది. అయితే అదానీ కంపెనీల షేర్లను ఎంఎస్‌సీఐ తన సూచీల నుంచి తొలగించకపోవడం గమనార్హం.
అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఏసీసీ వెయిటేజీని ఎంఎస్‌సీఐ తగ్గించింది. అంతేకాకుండా కంపెనీల షేర్ల ఫ్రీ ఫ్లోట్( ట్రేడింగుకు అందుబాటో ఉన్న షేర్లు) స్థాయిని కూడా తగ్గిస్తున్నట్లు చెప్పడంతో షేర్ల విలువ పడిపోతోంది. ఫ్రీ ఫ్లోట్ తగ్గితే ఆటోమేటిగ్గా షేర్ల వెయిటేజీ కూడా తగ్గుతుంది. ఫ్రీ ఫ్లోట్ తక్కువగా ఉంటే కంపెనీలపై యజమాని పట్టు ఉందని సంకేతం.
పతనం ఇలా..
ఆదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు విలువ 8 శాతం, ఆదానీ టోటల్ గ్యాస్ 6.4 శాతం, ఆదానీ ట్రాన్స్‌మిషన్ 5 శాతం, ఆదానీ పవర్ 5 శాతం, ఆదానీ విల్మర్ 3 శాతం క్షీణించాయి. ఆదానీ గ్రీన్ ఎనర్జీ, ఏసీసీ, ఎన్డీటీవీ, అంబుజా సిమెంట్స్ కూడా కాస్త పతనం కాగా, అదానీ పోర్ట్స్ విలువ మాత్రం 0.5 శాతం పుంజుకుంది.