అదానీ కంపెనీలలో అవకతవకలు జరిగాయంటూ హిండెన్ బర్గ్ సంస్థ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దాదాపు పది లక్షల కోట్ల మేర ఆర్ధిక మోసం జరిగిందంటూ ఆరోపణలు రావడంతో అదానీ షేర్లు కుప్పకులాయి. ఈ దెబ్బతో కుబేరుల జాబితాలో అదానీ ఘోరంగా పడిపోయింది. అటు దేశ రాజకీయాలను కుదిపేయగా, పార్లమెంటులో చర్చ కోసం విపక్షాలు పట్టుబట్టాయి. కానీ కేంద్రం దానిని తిరస్కరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. అదానీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీనియర్ అడ్వొకేట్ విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. ఈ నెల 13 వ తేదీ నాటికి వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. సోమవారం మళ్లీ విచారించిన కోర్టు ముందుకు కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అంగీకరిస్తున్నామని తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు మరోసారి చోటు చేసుకోకుండా నిబంధనలు రూపొందించాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తించిందన్నారు. అలాగే సెబీ కూడా ఇలాంటి వాటిని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. దీంతో ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేయాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది.