హిండెన్ బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమపై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని అదానీ గ్రూప్ ఖండించింది. వీరిద్దరి మధ్య వివాదం విషయంలో గురువారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ జరిపించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. షేర్ల వ్యవహారం, మోసం ఆరోపణలను పరిశీలించడానికి ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని తెలిపింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కమిటీలో సభ్యులుగా ఓపీ భట్, కేవీ కామత్, జస్టిస్ కేపీ దేవదత్, నందన్ నీలేకని, సోమశేఖర్ సుందరేశన్ ఉండనున్నారు.
ఈ నిపుణుల కమిటీకి సెబీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మద్దతు ఇవ్వాలని సుప్రీం కోర్టు పేర్కొంది. కమిటీ పరిస్థితిని మొత్తంగా అంచనా వేస్తుందని, పెట్టుబడిదారులకు అవగాహన కల్పించే చర్యలను సూచిస్తుందని తెలిపింది. సెబీ నిబంధనలలోని సెక్షన్ 19 ఉల్లంఘన జరిగిందా, స్టాక్ ధరలలో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే దానిపై దర్యాప్తు చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. రెండు నెలల్లో విచారణ జరిపి స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సెబీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. రెగ్యులేషన్ నిబంధనల ఉల్లంఘన ఉంటే కచ్చితంగా సెబీ విచారణ చేపట్టాలన్నారు.
అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ దేశంలో తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ రిపోర్ట్ నేపథ్యంలో ఇటీవల అదానీ సంస్థకు చెందిన కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ల నియంత్రణ చర్యల్ని బలోపేతం చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన నాలుగు వేర్వేరు పిటిషన్‌లపై తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి.