ప్రపంచ కుబేరుల్లో టాప్ 3లో ఉండి ఆసియా కుబేరుడిగా ఉన్న గౌతం అదానీ హిండెన్ బర్గ్ నివేదికతో భారీగా నష్టపోయారు. అంతకుముందు 120 బిలియన్ డాలర్ల సంపదతో తులతూగిన అదానీ బర్గ్ ఇచ్చిన షాక్‌తో ఏకంగా 49 బిలియన్ డాలర్లకు పడిపోయారు. మన కరెన్సీలో రూ. 4 లక్షల కోట్లకు చేరుకున్నాడు. ఇదేకాక కుబేరుల లిస్టుతో పాటు ఆసియా కుబేరుడి స్థానం కూడా కోల్పోయాడు. నెలరోజుల్లోనే హిండెన్ బర్గ్ నివేదికతో ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేగి అదానీ సంపద క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. అయితే హిండెన్ బర్గ్ నివేదిక వాస్తవ దూరమని, కుట్రపూరితంగా వ్యవహరించారని అదానీ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
లోపాలు జరగలేదంటూ 400కి పైగా పేజీల వివరణ ఇచ్చింది. ఇందుకోసం ఎలాన్ మస్క్ ట్విట్టర్ వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేసిన కార్పొరేట్ సంస్థను నియమించుకుంది. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇన్వెస్టర్లలో భయాల కారణంగా అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్ల విలువ క్రమంగా దిగజారుతూ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ అంశం పార్లమెంటు, సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తామే స్వయంగా నిపుణులతో కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తమకు ఇన్వెస్టర్ల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసింది.