హిండెన్ బర్గ్ రిపోర్టుతో కుదేలైన అదానీ గ్రూపుకు మరో దెబ్బ తగిలింది. ఒప్పంద గడువు ముగియడంతో రూ. 7 వేల 17 కోట్ల భారీ డీల్ రద్దైంది. ఈ మేరకు అదానీ పవర్ బుధవారం రెగ్యులేటరీ ఫైలింగులో తెలిపింది. డీబీ పవర్‌కి చెందిన థర్మల్ విద్యుత్ ఆస్తుల కొనుగోలు కోసం అదానీ పవర్ ఆగస్ట్ 2022లో ఒప్పందం చేసుకోగా, అక్టోబర్ 31 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత గడువును నాలుగు సార్లు పొడగించి ఫిబ్రవరి 15, 2023 కి మార్చారు. అయినా ఒప్పందం ముందుకు సాగకపోవడంతో ముగిసినట్టు అదానీ పవర్ ప్రకటించింది. అటు తమ సూచీల్లో అదానీ గ్రూప్ కంపెనీల వెయిటేజీపై మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ సానుకూల ప్రకటనతో కంపెనీ షేర్లు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. గురువారం మార్కెట్లో అదానీ పవర్ 4.97 శాతం, ఎన్డీటీవీ 5 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు 2.42 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.92 శాతం, అదానీ విల్మర్ 4.99 శాతం లాభాల్లో ఉన్నాయి. అయితే టోటల్ గ్యాస్, ఏసీసీ మాత్రం కొంత నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.