Adani surpasses Bill Gates in wealth
mictv telugu

సంపదలో బిల్‌గేట్స్‌ను దాటేసిన అదానీ.. లిస్టులో నాల్గో స్థానం

July 16, 2022

 

భారత వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ మరో ఘనతను సాధించారు. ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో నాల్గో స్థానానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను దాటేశాడు. ఆయనను ఐదో స్థానానికి నెట్టి అదానీ నాలుగో స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం అదానీ సంపద విలువ 112.9 బిలియన్ డాలర్లు (9 లక్షల కోట్లు), కాగా, బిల్ గేట్స్ సంపద విలువ 102.4 బిలియన్ డాలర్లు(8.19 లక్షల కోట్లు)గా ఉంది. అయితే అదానీ సంపాదన పెరిగి లిస్టులో ముందుకు రాలేదు. బిల్ గేట్స్ ఇటీవల 20 బిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వడంతో ఆయన సంపద కొద్దిగా తగ్గిపోయింది. దాని వల్ల అదానీ ముందుకు వచ్చాడు కానీ, సంపద పెరిగి కాదు. తాజా విరాళంతో బిల్ గేట్స్, అదానీల మధ్య వ్యత్యాసం కేవలం 10 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ లిస్టులో ఎలాన్ మస్క్ 229 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 87.3 బిలియన్ డాలర్ల సంపదతో లిస్టులో పదో స్థానంలో కొనసాగుతున్నాడు.