కరోనా భూతం.. ఊరే ఖాళీ చేశారు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా భూతం.. ఊరే ఖాళీ చేశారు

April 5, 2020

Adilabad district Village evacuated in fear of Corona

నిన్న ఒక్కరోజే ఆదిలాబాద్ జిల్లాలో పది కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ గ్రామం తీవ్ర భయాందోళనలకు గురైంది. ఊరుకు ఊరే ఖాళీ చేసి వెళ్లిపోయారు. వైరస్ తమ గ్రామం మీద ఎక్కడ దాడి చేస్తుందోనని వారంతా ఊరు విడిచి వెళ్లిపోయారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని మధురా నగర్‌ చుట్టుపక్కల నివాసం ఉండే 100 నుంచి 150 కుటుంబాలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. తమ పంటపొలాల్లోకి వెళ్లి తాత్కాలిక షెడ్లు వేసుకుని ఉంటున్నారు. 

తమ గ్రామాల్లోని ఇతరులకు కూడా కరోనా సోకుతుందన్న భయంతోనే ఊరు ఖాళీ చేశాం అని వారు చెబుతున్నారు. నేరడికొండ మండల కేంద్రంలో ఒక్కరోజే ముగ్గురికి కరోనా నిర్ధారణ అయింది. వారిని వైద్య సిబ్బంది క్వారైంటన్‌కు తరలించారు. కరోనా పాజిటివ్‌ అని తేలిన వ్యక్తులు ఇంతకు ముందు పది రోజులుగా నేరేడుకొండలో వివిధ ప్రాంతాల్లో తిరిగారు. ఈ క్రమంలో వారి గాలి తమ గ్రామం మీద సోకి వుండొచ్చు అనే అనుమానంతో వారు పొలం బాట పట్టారు. పొలాల్లో స్వచ్ఛమైన గాలి వస్తుంది కాబట్టి అలాంటి వైరస్ అటువైపు రాదని వారు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. జబ్బు తగ్గాకే మళ్లీ గ్రామంలోకి వస్తాం అంటున్నారు. ఆలోపు ఎన్ని తిప్పలు అయినా పడతాం కానీ, ఊళ్లోకి వెళ్లం అని తెగేసి చెబుతున్నారు.