పెళ్లయిన 16 ఏళ్లకు పుట్టిన బిడ్డ.. పాము కాటుకు బలి - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లయిన 16 ఏళ్లకు పుట్టిన బిడ్డ.. పాము కాటుకు బలి

June 10, 2022

పెళ్లైన పదహారేళ్లకు పుట్టిన ఆ బాబు కారణంగా వారి జీవితాల్లో వెలుగులు నిండాయి. దేవుడి ప్రసాదంగా లేకలేక పుట్టిన ఆ కుమారుణ్ని చూసుకుని ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. కానీ ఇంతలోనే విధి కన్నెర్ర చేసింది. వారి జీవితంలో కల్లోలం సృష్టించింది. పాము రూపంలో పసికందును కాటేసి కన్నవాళ్లను పుట్టెడు దుఃఖంలో ముంచేసింది. వివరాలిలా.. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అంతర్గాంలో నివాసముంటున్న బైరెడ్డి సంతోష్‌-అర్చన దంపతులకు నైతిక్‌(2) అనే కుమారుడు ఉన్నాడు. గురువారం వేకువజామునే నిద్రలేచి పక్కింటావిడ వద్ద ఆడుకుంటున్నాడు. అదే సమయంలో ఆ ప్రాంతంలో పాము కనిపించింది. దీంతో గ్రామస్థులు ఆ పామును కర్రతో కొట్టారు.
అచేతనంగా పడి ఉంటే చనిపోయింది అనుకుని దాని పక్కకు జరిపారు. చనిపోయిన పామును చూడడానికి అందరూ గుమిగూడారు. అందులో బాబును ఎత్తుకున్న పక్కింటి మహిళ కూడా ఉంది. అందరూ చనిపోయిన పామును వింతగా గమనిస్తూ ఉండగా.. ఒక్కసారిగా పైకి లేచిన పాము మహిళ చేతిలోని చిన్నారి నైతిక్ ను కాటేసింది. ఈ హఠాత్పరిణామానికి షాక్ తిన్న గ్రామస్తులు బాలుడిని హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పాము విషపూరితమైన రక్తపింజరి కావడంతో.. డాక్టర్లు అత్యవసర చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. గురువారం రాత్రి నైతిక్‌ ఈ లోకాన్ని వీడాడు. ఎన్నో ఏళ్లు ఎదురుచూసిన తర్వాత పుట్టిన బిడ్డ కళ్ల ముందే కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆ తల్లిదండ్రులను చూసి స్థానికులు కూడా కంటతడి పెట్టారు.