Adipurush release postponed.. This is the new date
mictv telugu

ఆదిపురుష్ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఇదే

November 7, 2022

ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ ‘ఆదిపురుష్‌’ రిలీజ్‌ వాయిదా పడింది. ఈ విషయం పాతదే అయినా మేకర్స్ ఈ నిజాన్నిఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. డైరెక్టర్ ఓంరౌత్‌ సోమవారం ఉదయం ఈ విషయం గురించి చెబుతూ.. ఆదిపురుష్‌ అనేది ఒక సినిమా కాదని, శ్రీరాముడిపై భక్తి, సంస్కృతి, చరిత్రలపై మనకున్న నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందించడం కోసం తమ టీమ్ కి మరికొంత సమయం తీసుకోవాల్సి వస్తోందన్నారు. “భారతదేశం గర్వించే సినిమాగా దీన్ని మీ ముందుకు తీసుకురావాలని మేము నిర్ణయించుకున్నాం . వచ్చే ఏడాది జూన్‌ 16న ‘ఆదిపురుష్‌’ను విడుదల చేయనున్నాం. మీ ప్రేమాభిమానాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ వార్తతో డార్లింగ్‌ ఫ్యాన్స్ మరికాస్త ఫైర్ అవుతూ పోస్టులు పెడుతున్నారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూ.300 కోట్లతో ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని రూపొందించారు. రాముడి పాత్రలో ప్రభాస్‌, సీతగా కృతిసనన్‌, రావణాసురుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. అయితే, దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా టీజర్‌పై సినీ ప్రియుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. హనుమంతుడు, మరికొన్ని పాత్రల్ని లెదరు దుస్తుల్లో చూపించడం, రావణాసురుడికి విచిత్ర వాహనాన్ని ఇవ్వడం లాంటి అంశాలపై విమర్శలు చెలరేగాయి. రాముడి లుక్స్‌, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ అసలేం బాలేదని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి వీఎఫ్‌ఎక్స్‌ పనులపై దృష్టి పెట్టారు. ఆదిపురుష్ గ్రాఫిక్స్ ను పూర్తిస్థాయిలో మళ్లీ మార్చబోతున్నారు. దీనికోసం మరింత బడ్జెట్ ను కేటాయించారు. ఈ క్రమంలో విడుదల తేదీని కూడా మార్చారు.