సుశాంత్ మృతితో నాకు లింకు లేదు.. సీఎం కొడుకు  - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్ మృతితో నాకు లింకు లేదు.. సీఎం కొడుకు 

August 4, 2020

బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి  కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే హస్తం ఉందని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయమై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా ‘బేబీ పెంగ్విన్’ అంటూ ఇండైరెక్టుగా ట్వీట్ చేసింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దూమారం చెలరేగింది. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై ఎట్టకేలకు ఆదిత్య ఠాక్రే స్పందించారు. తనపై వస్తున్న వదంతులన్నీ అసత్యాలే అని తేల్చి చెప్పారు. సుశాంత్ మృతితో తనకు అస్సలు లింక్ లేదని మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

కొందరు కావాలనే తనపై, ఠాక్రే కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఒకరి మరణంపై రాజకీయాలు చేస్తున్నారని స్పష్టంచేశారు. కాగా, ప్రస్తుతం సుశాంత్ సింగ్ కేసుపై ముంబై పోలీసులు, బీహార్ పోలీసులు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే  ఈ కేసులో ముంబై పోలీసులు సరిగ్గా దర్యాప్తు జరపడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బీహార్ పోలీసులకు కూడా సహకరించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు మేరకు బీహార్ పోలీసులు కూడా వేగంగా దర్యాప్తు చేపట్టారు. సుశాంత్ కేసు విచారణ నిమిత్తం ముంబై వెళ్లిన తమ సీనియర్ పోలీస్ అధికారిని బలవంతంగా హోం క్వారెంటైన్‌లో ఉంచడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అసంతృప్తి వ్యక్తంచేశారు. సుశాంత్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బీహార్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. కాగా, సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆమె కోసం బీహార్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.