Adivasi man takes 3-yr-old daughter's body on bike for 50 km , Khammam in Telangana
mictv telugu

ఖమ్మంలో విషాదం.. బైక్‌పై మృతదేహంతో 50 కి.మీ.ల ప్రయాణం

November 7, 2022

 Adivasi man takes 3-yr-old daughter's body on bike for 50 km , Khammam in Telangana

ఇప్పటి వరకు దేశంలో ఎక్కడో ఓ చోట డెడ్‌ బాడీని బైక్‌పై తీసుకెళ్లారని, భుజాలపై మోసుకెళ్లారనే వార్తలు వింటూనే వచ్చాము. ఇప్పుడు అలాంటి మరో ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఉచిత ఆంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో.. బైక్ పై కూతురి మృతదేహంతో ఇంటికి బయలు దేరాడు ఓ తండ్రి. బిడ్డ చనిపోయిన బాధను దిగమింగుతూ.. 50 కిలోమీటర్లు కూతురు డెడ్ బాడీని తీసుకెళ్లాడు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు కంటతడి పెట్టిస్తున్నాయి.

ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామంలో ఆదివాసి కుటుంబానికి చెందిన వెట్టి మల్ల, ఆది దంపతుల కుమార్తె వెట్టి సుక్కి(3) జ్వరంతో పాటు ఫిట్స్ రావడంతో ఆమెను ఏనుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ బాలిక పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన డాక్టర్లు వెంటనే పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు బాలికను ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆసుపత్రిలో చేర్పించిన చిన్నారికి వైద్యం చేసినా ఫలితం లేకపోయింది. ఆదివారం నాడు వైద్య చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.

కడుపున పుట్టిన బిడ్డ చనిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ఉచిత అంబులెన్స్ కోసం అడగగా.. ఆసుపత్రి సిబ్బంది లేదని చెప్పారు. ఆసుపత్రి బయట ఉన్న ప్రైవేటు వాహనదారుల దగ్గర విచారిస్తే.. పెద్ద మొత్తంలో డబ్బులు అడిగారు. దీంతో ఆ తండ్రికి ఏంచేయాలో పాలుపోక.. బిడ్డ మృతదేహం, భార్యతో పాటు తన తండ్రిని బైక్‌పై కూర్చోబెట్టుకుని ఇంటికి బయల్దేరాడు. ఖమ్మం నుంచి కొత్తమేడేపల్లి దాదాపు 50 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఇంత దూరం కూడా పాప మృతదేహంతో పాటు పాప తల్లిదండ్రులు, తాత కలిపి నలుగురు ప్రయాణించారు. దీనిని కొంతమంది ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి.