ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి తెరెక్కిస్తున్న RRR సినిమాను తాజాగా వివాదాలు వెంటాడుతున్నాయి. టీజర్ విడుదల కాగానే ఆదివాసీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గోండు వీరుడు కుమ్రం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ పై తీసిన టీజర్ ఇటీవల విడుదలైంది. దాంట్లో కుమ్రం భీమ్ చివర్లో ముస్లిం టోపీ ధరించినట్టు చూపెట్టడం వివాదానికి దారి తీసింది. ముస్లిం టోపీ ధరించడాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో చిత్ర యూనిట్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడికి టోపి పెట్టడం ఏంటని భీమ్ యువసేన నేతలు ప్రశ్నించారు. ఆదివాసీల మనోభావాలు దెబ్బ తినేలా సినిమాలు తీస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఆయన చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే సినిమా తీయాలని సూచించారు. టోపీ సన్నివేశాలను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.