Adivi sesh hit 2 Telugu movie Review
mictv telugu

హిట్- 2 రివ్యూ

December 2, 2022

హిట్ పార్ట్ వన్ సక్సెస్ కావడం, డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్షన్‌లో నాని నిర్మాతగా హిట్ పార్ట్-2 కూడా అనౌన్స్ అవడంతో ఫస్ట్ నుంచే ఆడియెన్స్‌లో ఆసక్తి మొదలైంది. సస్పెన్స్ జానర్‌లో సరికొత్త కథాంశంతో తెలుగులో ఓ మంచి సినిమా వచ్చి చాలా రోజులవడంతో ప్రేక్షకులు హిట్-2 కోసం ఎదురుచూశారు. మరి ఈ శుక్రవారం థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? అంచనాలను అందుకోగలిగిందా? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ విషయానికొస్తే..

కేడీ అలియాస్ క్రిష్ణ దేవ్ (అడివి శేష్) వైజాగ్‌లో పోలీస్ ఆఫీసర్. ఏ కేసునైనా ఈజీగా సాల్వ్ చేస్తూ క్రిమినల్స్ అందరూ కోడిబుర్రలనే నమ్మకంతో ఉంటాడు. ఇంతలో సంజన అనే అమ్మాయి డెడ్ బాడీని పోలీసులు గుర్తిస్తారు. దర్యాప్తులో అది ఒకే మహిళకు సంబంధించిన డెడ్ బాడీ కాదనీ, శరీరంలోని వేర్వేరు భాగాల్ని ఒక చోట వేసి ఒకటే బాడీగా నమ్మించాడని తేలుతుంది. దాంతో ఆ సైకో కిల్లరుని పట్టుకోవడానికి కేడీ అండ్ టీమ్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఆ సైకో దొరికాడా? అసలింతకీ ఆ కిల్లర్ ఎవరు? ఎందుకలా మారాడనేదే కథ.

ఎలా ఉందంటే..

ఓటీటీలు, మొబైల్స్ వచ్చేసి ప్రేక్షకులు వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయిన అన్ని సినిమాల్నీ చూసేస్తుండడంతో, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాల్లో ట్విస్ట్ ఏంటి? విలన్ ఎవరు? లాస్ట్ లో రివీల్ చేసే ప్లాట్ ఏంటి? అని ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. దీంతో డైరెక్టర్స్ కూడా కొత్త తరహా కథలు రాసి ఆడియెన్సును ఎంగేజ్ చేయడానికి చాలానే కష్టపడాల్సొస్తుంది. శైలేష్ కొలను మాత్రం హిట్ వన్‌తో ఎలాగైతే ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగాడో, హిట్ టూ తోనూ మెప్పించగలిగాడు. నిడివి కోసమో, కమర్షియల్ ఎలిమెంట్స్ కోసమో ఎక్కువగా లా..గకుండా బాగానే మేనేజ్ చేశాడు. ప్రతి 15, 20 నిమిషాలకో ట్విస్ట్ ఇస్తూ బోర్ కొట్టకుండా కథని చక్కగా రాసుకున్నాడు. ఇక హిట్ త్రీ మూవీకి లీడ్ ఇస్తూ చివర్లో ఓ హీరో ఎంట్రీ ఇవ్వడం సర్ ప్రైజ్ ఎలిమెంట్. ఈ లెక్కన హిట్ 3 పై కూడా ఆల్రెడీ అంచనాలు పెంచేశాడు శైలేష్.

ఎవరెలా చేశారంటే..

అందరికన్నా ముందుగా చెప్పుకోవాల్సింది హీరో అడివి శేష్ గురించి. రైటర్‌గా సస్పెన్స్ జానర్‌లో తనే కథలు రాసి సినిమాలు చేసినా.. హీరోగా కూడా వేరే దర్శకుడితో సినిమా ఒప్పుకున్నాడంటేనే కథ మీద తనకున్న నమ్మకమేంటో అర్థం చేసుకోవచ్చు. క్రిష్ణదాస్ పాత్రలో చక్కగా ఒదిగిపోయి, నటుడిగా ఓ మంచి పాత్ర దొరికితే ఎంతలా ది బెస్ట్ ఇవ్వగలడో మరోసారి నిరూపించాడు. ఇక హీరోయిన్(మీనాక్షి చౌదరి) రోల్ కి పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బానే చేసింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ బెస్ట్ మేకింగ్‌తో శైలేష్ కూడా దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. ఇలాంటి నేపథ్యమున్న చిత్రాలకి మ్యూజిక్, ఎడిటింగ్ ప్రధాన బలం కాబట్టి.. ఆ డిపార్ట్‌మెంట్స్ నుంచి కూడా మంచి అవుట్ పుటే వచ్చింది.

ఓవరాల్‌గా ఎలా ఉందంటే..

మరీ పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా, కంపారిజన్స్ లేకుండా సస్పెన్స్ జానర్ నచ్చే ఆడియెన్స్ ఎంచక్కా చూసేయొచ్చు. అక్కడక్కడా హిట్ వన్ మూవీ సీన్స్ కి కూడా లింకప్స్ ఉండడం వల్ల, ఈ సినిమా చూసే ముందు పార్ట్ వన్ చూస్తే ఇంకాస్త ఎక్కువ ఎంగేజయ్యే స్కోప్ ఉంది.