Admissions committees in Telangana political parties bjp congress
mictv telugu

పార్టీల్లో చేరికల కమిటీలు.. ఈ ట్రెండ్ దేనికి సంకేతం?

July 6, 2022

Admissions committees in Telangana political parties bjp congress

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది చాలా పాతబడిపోయిన మాట. పార్టీలు తమ ప్రయోజనాల కోసం హత్యలు, అత్యాచారాలు వంటి ఘోరనేరాలు తప్ప మరెలాంటి పనులైనా భేషుగ్గా చేసుకోవచ్చు, చేసుకోవాలి, చేసుకుని తీరాలి అనేది కొత్తమాట. స్వరైర్వెల్ ఆఫ్ ద ఫిట్టెస్ అన్న డార్విన్ సూత్రం మానవజాతి పరిణామ క్రమానికే కాదు, రాజకీయ పార్టీల గ్రోత్‌కూ తప్పనిసరి. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. పార్టీలో కొత్తగా పుట్టుకొట్టుస్తున్న చేరికల కమిటీల గురించి.

తెలంగాణ కాంగ్రెస్ విభాగం ‘ఆకర్ష ఆకర్ష’ కోసం చేరికల జానారెడ్డి సారథ్యంలో కమిటీని ఇటీవల ఏర్పాటు చేసుకుంది. బీజేపీ కూడా తనేం తక్కువా అన్నట్లు మొన్న చేరికల కమిటీని నియమించి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు దాని బాధ్యతలు అప్పగించింది. పేరులోనే ఉన్నట్లు ఈ కమిటీల ఉద్దేశం త్రికరణ శుద్దితో ఇతర పార్టీల బాడా, చోటామోటా నేతలను తమ గూటికి తీసుకురావడం వీటి లక్ష్యం. ఏ పార్టీలో ఎవరు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారు? ఎవరి బలమెంత, ఎవరి బలహీనతలేమిటి, ఎవరు దేనికి పడిపోతారు? ఎవరొస్తే తమకు మేలు జరుగుతుంది? ఇలాంటి కసరత్తు పూర్తి చేసి, తర్వాత ఆ టార్గెట్లను అధిష్టానానికి పరిచయం చేసి తీర్థం ఇవ్వడం వీటి బాధ్యతలు. చేరికల వల్ల సొంతపార్టీలో వచ్చే అలకలు, విమర్శలను సద్దుమణిగించడం అదనపు బాధ్యత.

పైకి ఇది చాలా సాధారణ విషయంగా కనిపిస్తున్నా నైతికంగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇదివరకు పార్టీలు తమ విధానాలతో, పనితీరుతో, ప్రచారంతో ప్రజల్లోకి వెళ్లేవి. ఆ ప్రజల్లో ఇతర పార్టీల నేతలు కూడా ఉంటారు కాబట్టి ఎవరైనా ఆకర్షితులై చేరేవాళ్లు. పార్టీలు ఫలానా నాయకుడు, నాయకురాలు తమకు పనికొస్తాడనుకుంటే రాయబారాలు నడిపి, చర్చలు జరిపి, ఆ తర్వాత చేరికలకు వెళ్లేవి. అదంతా ఓల్డ్ ఫ్యాషన్ అనుకున్నారో, లేకపోతే దాచడానికి ఏమీ లేదనుకున్నారోగాని చక్కగా ‘చేరికల కమిటీల’ను వేసి కష్టాలు అధిగమించారు. చేర్చుకునేవాళ్లకే కాకుండా, చేరేవాళ్లకు కష్టం తప్పిపోయింది. ప్రజలు, మీడియా కూడా ఈ కమిటీలను పార్టీ ప్రచార కమిటీ, సమన్వయ కమిటీ, ఎన్నికల కమిటీ, ఆర్థిక కమిటీ వంటిని చాలా సాధారణ, అవసరమైన కమిటీల్లాగా భావిస్తుండడం గమనించాల్సిన విషయం.

ఇదివరకు వేరే పార్టీల నేతలను కలవడమే అపరాధం, పార్టీని మారడం ద్రోహం, దగా, మోసం అన్న భావనలు ఈ కమిటీల పుణ్యమా అని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. నైతిక ప్రశ్నలను పక్కన పెడితే ఇలాంటి కమిటీల వల్ల పార్టీల పారదర్శకత, వ్యూహాలు, ఎత్తుగడలు అటు ఇతర పార్టీలకే కాకుండా ప్రజలకు కూడా తెలుస్తుండడం అందరూ మెచ్చుకోవాల్సిన విషయం! ఇంకా చేరికల కమిటీలు వేసుకోకుండా, చాటుమాటు వ్యవహారాలు నడిపే పార్టీలకు కూడా ఇది ఆదర్శంగా నిలిచి నైతిక స్థైర్యాన్నిస్తాయి. మనది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యబద్ధంగా బహిరంగంగా బలప్రయోగం లేకుండా ఏ పనినైనా చేసుకునే వీలుంది!!