ఉద్ధవ్ మంత్రివర్గంలో ఎన్సీపీకి కీలక పదవులు! - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్ధవ్ మంత్రివర్గంలో ఎన్సీపీకి కీలక పదవులు!

December 1, 2019

మహారాష్ట్రలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. మరి సంకీర్ణంలో పాలు పంచుకున్న మిగతా రెండు పార్టీలకు ఏం పదవులు దక్కుతాయనే విషయం సస్పెన్సుగా మారింది. ముఖ్యమైన స్పీకర్‌ పదవిని కాంగ్రెస్‌ పార్టీకి కేటాయించడంతో ఆ పార్టీకి పరిమిత సంఖ్యలో మాత్రమే మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఉద్ధవ్‌తో పాటు మూడు పార్టీల నుంచి మంత్రులుగా ఆరుగురు ప్రమాణం చేశారు. ఎన్సీపీ నుంచి జయంత్‌ పాటిల్‌, ఛగన్‌ భుజ్‌బల్‌, కాంగ్రెస్‌ నుంచి బాలాసాహెబ్‌ థోరట్‌, నితిన్‌ రౌత్‌, శివసేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే, సుభాష్‌ రాజారాం దేశాయ్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఇదిలావుండగా కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో శరద్‌పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)కి కీలక పదవులు దక్కనున్నట్లు సమాచారం. గరిష్ఠంగా 43 మందిని మంత్రులుగా నియమించే అవకాశం ఉండగా.. అందులో ఆ పార్టీకి 16 స్థానాలు దక్కనున్నట్లు తెలుస్తోంది. శివసేనకు కూడా 15 మంత్రి పదవులు దక్కనున్నాయి. 

NCP.

కాంగ్రెస్‌కు 12 మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ నేత జయంత్‌ పాటిల్‌కు కీలకమైన హోంశాఖ కేటాయించనున్నారు. కాంగ్రెస్‌-ఎన్సీపీ ప్రభుత్వ హయాంలో ఆయన అదే శాఖను నిర్వహించారు. అలాగే ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కనుంది. శరద్‌ పవార్‌ అన్న కొడుకు అజిత్‌ పవార్‌కు ఈ పదవిని కేటాయించనున్నారట. 

కాంగ్రెస్‌ పార్టీకి రెవెన్యూ శాఖ దక్కనుంది. అశోక్‌ చవాన్‌కి లేదా బాలాసాహెబ్‌ థోరట్‌కు ఈ పదవి కేటాయించే అవకాశం మెండుగా ఉంది. మరోవైపు మంత్రులుగా ప్రమాణం చేసిన ఏక్‌నాథ్‌ షిండే, సుభాష్‌ దేశాయ్‌ గతంలో ఫడ్నవీస్‌ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రులుగా పనిచేశారు. వీరికి ఏ పదవులు కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది.