రైతులకు పెట్టుబడి సాయం కింద తెలంగాణ ప్రభుత్వం.. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేలు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎకరానికి రూ.5 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నది. ఈ ఏడాది వానాకాలం తొలివిడుత ఎకరానికి రూ.5 వేల చొప్పున పంపిణీ చేసింది. రెండోవిడుతలో గత డిసెంబర్ 28 నుంచి ఆర్థికసాయం పంపిణీ చేయడం ప్రారంభించింది. చాలామంది రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా మారింది.
అయితే, 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతుబంధు పథకం వర్తింపజేయాలని ఓ కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే నిధులను 5 ఎకరాలు అంతకంటే తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమచేసేలా పరిమితి పెట్టాలన్నారు ఓ వ్యవసాయ అధికారి. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలకేంద్రంలో వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ)గా పనిచేస్తున్న కల్లేపల్లి పరశురాములు.. ఈ విషయమై సీఎం కేసీఆర్ కు లేఖ కూడా రాశారు. 5 ఎకరాలున్న రైతులందరి ఖాతాల్లో జమ చేసి.. మిగిలిన నిధులను పొలాలకు వెళ్లే కాలిబాటలను నిర్మించడానికి ఉపయోగించాలన్నారు. లేఖను మంగళవారం తపాలా ద్వారా ప్రగతిభవన్ చిరునామాకు పంపారు.