Aero India Example Of India's Expanding Capabilities: PM Narendra Modi In Bengaluru
mictv telugu

‘21వ శతాబ్దపు కొత్త భారతదేశం ఏ అవకాశాన్ని కోల్పోదు’

February 13, 2023

Aero India Example Of India's Expanding Capabilities: PM Narendra Modi In Bengaluru

ఆసియాలోనే అతిపెద్ద ఏరో ఇండియా-2023(Aero India 2023) ప్రదర్శనను బెంగళూరు శివారులోని యలహంకలో ప్రారంభమైంది. యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ 14వ ఎడిషన్ ఏరో ఇండియా-2023 ప్రదర్శనను ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఏరో ఇండియా-2023లో ఎయిర్‌ షోలు, ప్రదర్శనలతో సందర్శకులను ఆకట్టుకోనుంది. ‘ద రన్‌ వే టు ఏ బిలియన్‌ ఆపర్చునిటీస్‌’ పేరిట నిర్వహించనున్న ప్రదర్శనను ప్రధాని మోదీ ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేడు ఏరో ఇండియా ఒక ప్రదర్శన మాత్రమే కాదు.. భారతదేశం ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం అని అన్నారు. ఏరో ఇండియా భారతదేశం కొత్త బలం, సామర్థ్యాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు. రక్షణ రంగంలో భారత్ బలోపేతం అయిందని తెలిపారు. నేడు మన విజయాలు భారతదేశ సామర్థ్యానికి నిదర్శనం అని , తేజస్ విమానమే దానికి ఉదాహరణ అని అన్నారు. దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణపరికరాల దిగుమతిదారుగా ఉన్న భారత్.. ఇప్పుడు ప్రపంచంలోని 75దేశాలకు రక్షణరంగ పరికరాలను ఎగుమతి చేస్తోందన్నారు. నేడు భారతదేశం ప్రపంచంలోని రక్షణ సంస్థలకు మార్కెట్ మాత్రమే కాదని.. సంభావ్య రక్షణ భాగస్వామి అన్నారు. 21వ శతాబ్దపు కొత్త భారతదేశం ఏ అవకాశాన్ని కోల్పోదని చెప్పారు.

యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ ప్రముఖ యుద్ధ విమానాలలో ఒకటైన ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్ ఫైటర్ జెట్‌ ప్రదర్శనలో పాల్గొంది. ఎఫ్/ఏ-18ఈ, ఎఫ్/ఏ-18ఎఫ్ సూపర్ హార్నెట్, యూఎస్ నేవీకి చెందిన అత్యంత అధునాతన ఫ్రంట్‌లైన్ క్యారియర్-ఆధారిత, మల్టీరోల్ స్ట్రైక్ ఫైటర్ ఈరోజు దర్శించేందుకు అందుబాటులో ఉన్నాయి. ఇవి స్టాటిక్ డిస్‌ప్లేలో ఉంటాయి. 98 దేశాలకు చెందిన దాదాపు 809 కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నాయి. వివిధ భారతీయ మరియు విదేశీ రక్షణ సంస్థల మధ్య రూ.75,000 కోట్ల పెట్టుబడుల అంచనాతో 251 ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.