భారత్ పొరుగున్న ఉన్న దేశం పరిస్థితి పెనంలోంచి పొయ్యిలో పడినట్లు ఉంది. రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడి, తాలిబన్ తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయిన అఫ్ఘానిస్తాన్ పరిస్థితి రోజురోజుకూ దారుణంగా దిగజారుతోంది. ఒకపక్క తాలిబన్ల ఆంక్షలు, మరోపక్క ఉపాధి అవకాశాలు లేక ప్రజలు అన్నమో అల్లా అని అల్లాడుతున్నాడు. ఆకలితో అలమటిస్తున్న పిల్లలకు పిడికెడు తిండిపెట్టలేక నిద్రమాత్రలు వేసి పడుకోబెడుతున్నారు. కడుపుకు బుక్కెడు తిండిదొరక్క కిడ్నీలు సైతం అమ్ముకుంటున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలను సైతం అమ్మేసుకుంటున్నారు.
అఫ్ఘాన్‌లో మూడో పెద్ద నగరమైన హెరాత్‌లో పరిస్థితి ఘోరంగా తయారైంది. శివారులోని మట్టి గుడిసెల్లో నివసిస్తున్న వేలమంది నిరుపేదలు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆడపిల్లలను రూ.2 లకు అంగడి సరుకుల్లా అమ్ముకుంటున్నారు. చేయడానికి పనిలేక కిడ్నీలు కూడా బేరం పెట్టి అమ్మేసుకుంటున్నారు. ‘‘మా పిల్లలకు తిండి లేదు. నిద్రపోవడం లేదు. మెడికల్ షాపుకు వెళ్లి మాత్రలు తెచ్చి వేస్తున్నాం. పిల్లలందరికీ అంతే,’’ అని చెప్పాడు అబ్దుల్ వాహెబ్ అనే నిరుపేద. ఏడాది వయసున్న తన కొడుక్కి కూడా నిద్రమాత్ర వేశానని గులాం హజ్రత్ తెలిపాడు. నానా తిప్పలూ పడి కొనుక్కున్న బ్రెడ్డును తలా ఇంత పంచుకుని తింటున్నారు. పొద్దున పొడి బ్రెడ్డు తింటున్నామని, రాత్రి నానబెట్టుకుని తింటున్నామని ఓ మహిళ చెప్పింది. ఓ యువకుడు తను చేసిన అప్పులు తీర్చడానికి కిడ్నీని రూ. 2.5 లక్షలకు అమ్ముకున్నాడు. ‘‘నా కూతుర్ని రూ.92వేలకు అమ్ముకున్నాను. ఇస్లాం ప్రకారం ఇది తప్పు. కానీ మిగతా పిల్లలను ఆకలితో చంపుకోలేక ఆ తప్పలేదు’’ అని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. సరైన ఆహారం అందక పిల్లలు కర్రపుల్లల్లా కనిపిస్తున్నారు. ఒమిద్ అనే 14 నెలల బాబు కేవలం నాలుగు కేజీల బరువుతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
ప్రపంచం వల్లేనట..
ఈ సంక్షోభానికి తాము కారణం కాదని తాలిబన్లు అంటున్నారు. ‘‘మా దేశ ఆస్తులపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. ఇనుప గనులు తిరిగి తెరవాలనుకుంటున్నాం’’ అని తాలిబన్ అధికారి చెప్పాడు. అయితే అప్ఘాన్‌తో వ్యాపారం చేయడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చే పరిస్థితి లేకపోవడం గమనార్హం. అఫ్ఘాన్ నగరాల గురించి మీడియాలో చాలా వార్తలు వస్తుంటాయి. అయితే మారూమూల గ్రామాల్లో ఏం జరుగుతోందో బయటికి రావడం లేదు. ఆడపిల్లలు చదువుకోవద్దని తాలిబన్లు శాసిస్తున్న విషయం తెలిసిందే. పేదదేశమైన అఫ్ఘాన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఇరుగుపొరుగు దేశాలు భయపడుతున్నాయి. భారత్ తెగించి కొంత సాయం చేస్తున్నా ఏ మూలకూ చాలడం లేదు.